24 April, 2026 | 12:56 AM

‘రఘురాం’ సంకల్పం.. పల్లెల్లో వికాసం

24-04-2026 12:00 AM
  1. రూ.8.50 కోట్లతో గ్రామాలాభివృద్ధికి నిధులు మంజూరు
  2. ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి కృషి

ఖమ్మం, ఏప్రిల్ 23(విజయక్రాంతి): పల్లె ముంగిట ప్రగతి బాటే లక్ష్యంగా ఖమ్మం జిల్లాలో  అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి శ్రీకారం చుట్టారు.  జిల్లాలో పల్లె సీమలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ 2025-26 నిధుల ద్వారా జిల్లా వ్యాప్తంగా మౌలిక వసతుల కోసం విశేష కృషి చేస్తున్నారు. రూ.8.50 కోట్ల భారీ అంచనా వ్యయంతో 199 పనులకు శ్రీకారం చుట్టి, తనదైన ముద్ర వేస్తున్నారు.

సింగరేణి మండలానికి సింహభాగం

ఈ నిధుల కేటాయింపులో ఎంపీ రఘురాం రెడ్డి సింగరేణి (కారేపల్లి) మండలానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. జిల్లాలోనే అత్యధికంగా ఈ ఒక్క మండలానికే రూ.152.50 లక్షల నిధులను కేటాయించారు. ఇక్కడ మొత్తం 34 అభివృద్ధి పనులను చేపట్టడం ద్వారా మండలంలోని గ్రామాల రూపురేఖలను మార్చేందుకు ఆయన భారీగా నిధులు వెచ్చించారు.

మండలాల వారీగా నిధులు, పనుల వివరాలు ఇలా..

జిల్లాలోని అన్ని మండలాల అభివృద్ధికి సమానంగా నిధులు పంపిణీ చేస్తూ ఎంపీ చొరవ చూపారు. తల్లాడ మండలానికి రూ.95 లక్షలు (23 పనులు), బోనకల్ మండలానికి రూ.78.50 లక్షలు (18 పనులు), కల్లూరుకు రూ.58.50 లక్షలు (15 పనులు), ముదిగొండకు రూ.53.50 లక్షలు (12 పనులు), చింతకాని మండలానికి రూ.50 లక్షలు (13 పనులు) మంజూరు చేశారు. అలాగే రఘునాధపాలెం మండలానికి రూ.42 లక్షలు (9 పనులు), వైరాకు రూ.40.50 లక్షలు (11 పనులు), కొణిజర్లకు రూ.35 లక్షలు (10 పనులు),

మధిరకు రూ.22.50 లక్షలు (6 పనులు), సత్తుపల్లికి రూ.22 లక్షలు (7 పనులు) కేటాయించారు. వీటితో పాటు ఎన్కూరుకు రూ.16 లక్షలు (4 పనులు), వేంసూరుకు రూ.15 లక్షలు (4 పనులు), తిరుమలాయపాలెం మండలానికి రూ.13 లక్షలు (3 పనులు), ఎర్రుపాలెంకు రూ.12.50 లక్షలు (3 పనులు), ఖమ్మం రూరల్కు రూ.10 లక్షలు (2 పనులు), పెనుబల్లి మండలానికి రూ.9.50 లక్షల (2 పనులు) నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు.

రూ. 1.50 కోట్లతో పాలేరు నియోజకవర్గంలో..

ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాలకు సంబంధించి రూ.1,00,50,000నిధులతో మాలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టగా.. అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. 

నిరంతరం పర్యవేక్షించాలని  ఉన్నతాధికారులకు ఎంపీ ఆదేశం

మంజూరైన 199 పనుల్లో ఇప్పటికే 157 పనులకు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యింది. ప్రస్తుతం 43 పనులు శరవేగంగా పురోగతిలో ఉండగా, 51 పనులు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. అభివృద్ధి పనుల నాణ్య త విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, నిర్దేశిత గడువులోగా వంద శాతం పనులు పూర్తి కావాలని ఎంపీ రఘురాం రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పనిని ఆయన వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుం డటంతో పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతోంది. ఎంపీ ప్రత్యేక కృషి పట్ల సర్పంచ్ లు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.