పంజాబ్‌కు ఎదురుందా?
కోల్‌కతా, ఏప్రిల్ 5: ఐపీఎల్ 19వ సీజన్ లో వరుస విజయాలతో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసింది. సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడబోతోంది. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచిన పంజాబ్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఆ జట్టు బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య. కూపర్ కన్నోలీ , శశాంక్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ చెలరేగి ఆడుతున్నారు.
స్టోయినిస్ లాంటి ఆల్ రౌండర్ కూడా పంజాబ్‌కు అడ్వాంటేజ్. బౌలింగ్ లో సైతం పంజాబ్ అదరగొడుతోంది. మార్కో యెన్సన్, బార్ట్ లెట్, విజయ్ కుమార్ వైశాఖ్‌తో పాటు స్పిన్నర్ చాహల్ కూడా నిలకడగా రాణిస్తున్నారు. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్తి ఒత్తిడిలో ఉంది. రహానే కెప్టెన్సీలో గత సీజన్‌లో నిరాశపరిచిన కేకేఆర్ ఈ సారి కూడా పేలవ ప్రదర్శనతో సతమతమవుతోంది. అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లెవ్వరూ రాణించడం లేదు.
ముంబై ఇండియన్స్‌పై భారీస్కోరు చేసినా ఓడిపోయింది. తర్వాత సన్‌రైజర్స్ పై భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో చేతులెత్తేసింది. రఘువంశీ, రింకూ సింగ్ తప్పిస్తే మిగిలివారంతా ఫ్లాప్ అవుతున్నారు. బ్యాటర్లు గాడిన పడితే తప్ప కోల్‌కతా తొలి విజయాన్ని రుచిచూడడం కష్టమే. అటు బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మ్యాజిక్ చూపించలేకపోతున్నాడు. పేస్ విభాగంలో ముజర్బానీ, వైభవ్ అరోరా రాణిస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడనున్న నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కే మొగ్గుచూపుతుంది.




