31 March, 2026 | 2:38 AM

కాళేశ్వరంతో ప్రజాధనం వృథా

31-03-2026 01:08 AM

మూడేళ్లలో తెలంగాణ నుంచి కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలేవీ రాలేదు 

కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సీఆర్ పాటిల్

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేశారని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టంచేశారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణం అని ఆయన అన్నారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సోమవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై కేంద్ర బృందం అధ్యయనం చేస్తోందని చెప్పారు.

జల్ జీవన్ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మంత్రి చెప్పారు. తెలంగాణ వద్ద జల్ జీవన్ మిషన్ నిధులు రూ. 873 కోట్లు ఉన్నాయని వీటిలో నుంచి ఈ మూడేళ్లలో రూ. 194 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని తెలిపారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద గత మూడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్త సాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలేవీ అందలేదని సీఆర్ పాటిల్ వెల్లడించారు.

99 ప్రాజెక్టులలో 71 పనులు చాలాకాలంగా నిలిచిపోయాయని అన్నారు. తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులను పీఎంకేఎస్‌వై ఏఐబీపీ కింద చేర్చామని, వీటికి అర్హత కలిగిన కేంద్ర సహాయంగా రూ. 1,129.80 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ. 981.49 కోట్ల కేంద్ర సహాయం అందించిందని వెల్లడించారు.