20 April, 2026 | 7:44 PM

పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి

20-04-2026 06:14 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ ఫోర్ట్ నైట్ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను జాతీయ హరిత దళం రీజనల్ ప్రాజెక్టు అధికారి విద్యాసాగర్, జిల్లా సమన్వయకర్త కటకం మధుకర్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు చేపట్టిన ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ ఫోర్ట్ నైట్ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజలను చైతన్యవంతలను చేయాలని తెలిపారు.

భూమి సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, నేల సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, సేంద్రియ ఎరువుల వినియోగం వంటి చర్యలు పర్యావరణానికి దోహదపడతాయని తెలిపారు. నేల పరిరక్షణకు సంబంధించి ముఖ్య సందేశాలు, సేంద్రియ ఎరువుల వినియోగం, సింగిల్ యూత్ ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలను ప్రజలకు వివరించాలని, విద్యార్థులు, యువతలో పర్యావరణంపై చైతన్య పరచడమే లక్ష్యమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.