23 July, 2026 | 1:26 AM

నాణ్యమైన విద్యుత్ సరఫరాయే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

23-07-2026 12:48 AM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హనుమకొండ(మహబూబాబాద్), జూలై 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వ్యవస్థలో మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా హనుమకొండలో రూ.56 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు విద్యుత్ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం  మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశంలో తెలంగాణను విద్యుత్ రంగంలో ఆదర్శంగా నిలిపే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడం, పరిశ్రమలు, వాణిజ్య, వ్యవసాయ రంగం, గృహ అవసరాలకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

కాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో కలిసి హనుమకొండ నగరంలోని వాజ్‌పాయి కాలనీ, ఆర్ అండ్ బీ క్వార్టర్స్, విద్యుత్ నగర్, వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ప్రాంతాల్లో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు, హనుమకొండ నూతన సర్కిల్ కార్యాలయ భవనానికి, అలాగే టీజీఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఐదో అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం డబుల్ బెడ్రూమ్ కాలనీలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని, టీజీఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో అత్యాధునిక సమావేశ మందిరాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం టీజీఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న, జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) నిఖిల, టీజీఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.