13 March, 2026 | 1:38 AM

ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ మెరుగైన సేవలు అందించాలి

13-03-2026 12:03 AM

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సులో  కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నిజామాబాద్, మార్చి 12 (విజయ క్రాంతి) : అభివృద్ధికి పాటుపడతారనే నమ్మకంతో గెలిపించిన ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ, వారికి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నూతనంగా ఎన్నికైన నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు,  బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లకు గురువారం నిజామాబాద్ శివారులోని బోర్గం(పి)లో గల భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ లో అవగాహన సదస్సు నిర్వహించారు.

అదేవిధంగా అమృతా గార్డెన్ లో సర్పంచ్ లకు అవగాహన సదస్సు జరిగింది. ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అధికారాలు, విధులు, బాధ్యతల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ, ప్రింటెడ్ మెటీరియల్ ను అందజేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, నగర మేయర్ కే.ఉమారాణి, డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్ తదితరులు ఈ సదస్సులలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, హక్కులు, అధికారాలతో పాటు బాధ్యతలను సైతం సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నూతనంగా ఎన్నికైన స్థానిక సంస్థల సభ్యులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.  ఏవైనా లోటుపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

నిధులు, విధులను సక్రమంగా వినియోగిస్తూ, అందరి సమన్వయంతో గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని మార్గనిర్దేశం చేశారు.  అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయాలనే ప్రగాఢ సంకల్పంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన  ప్రగతి ప్రణాళికలో అందరిని భాగస్వాములు చేస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చొరవ చూపాలన్నారు.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, ప్రజల అవసరాలను గుర్తిస్తూ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఉందని సూచించారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

ఈ సదస్సులలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీపీఓ శ్రీనివాస్ రావు, డీఆర్డీఓ సాయాగౌడ్, డీఈఓ అశోక్, ఏ.ఓ రాజబాబు, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.