బురదలో వరినాట్లతో నిరసన
డ్రైనేజీ సమస్యపై వ్యాపారుల ఆగ్రహం
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 07 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక నిత్యం నీరు నిలుస్తోందని ఆగ్రహించిన వ్యాపారులు, స్థానిక ప్రజలు శుక్రవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. బురద నీటితో నిండిన రహదారిలో వరినాట్లు వేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం నుండి పోలీస్ స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై వర్షం పడిన ప్రతిసారి నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగు నీరు రోడ్డుపై నిలిచి దుర్వాసన వ్యాపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వెంటనే శాశ్వత డ్రైనేజీ నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.






