లోక్‌సభ సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ: నీట్ (NEET) పరీక్షా పత్రం లీక్, రామమందిర విరాళాల చోరీ వంటి వివిధ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించడంతో శుక్రవారం నాడు లోక్‌సభ(Lok Sabha adjourned ) సమావేశాలు సోమవారం వరకు వాయిదా పడ్డాయి. గందరగోళం మధ్య, 'సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026'ను సభ ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించింది. ఆ రోజుకు నిర్ణయించిన పత్రాలు, వివిధ పార్లమెంటరీ కమిటీల నివేదికలు సభలో ప్రవేశపెట్టబడ్డాయి. అటు పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు వర్షంలోనే కేంద్రం, అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
జూలై 20న నిరసనకారులపై జరిగిన పోలీసు చర్యకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ప్రకటన చేయాలన్న తన డిమాండ్‌ను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం మరోసారి పునరుద్ఘాటించారు. అమిత్ షా ప్రతిరోజూ పార్లమెంటుకు వస్తున్నారని, ఆయన పేరును ప్రస్తావిస్తూ ప్రతిరోజూ నిరసన తెలపడం సరికాదని లోక్‌సభలో నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష సభ్యులతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Minister Kiren Rijiju) అన్నారు.
రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ అమిత్ షాకు ఆదేశాలు జారీ చేశారని మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) పేర్కొనగా, రిజిజు ఆ వాదనను ఖండించారు. సభకు హాజరు కావాలని ఏ మంత్రికి కూడా రాజ్యసభ చైర్మన్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని రిజిజు స్పష్టం చేశారు. "ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటుకు రావడానికి భయపడుతున్నారని నాకనిపిస్తోంది. ఏదో కారణం చేత ఆయన రావడం లేదు. ఆయన రావాలి, సమాధానం చెప్పాలి, ప్రకటన చేయాలి. ఇందులో అంత పెద్ద విషయం ఏముంది? ఏదైనా తప్పు జరిగి ఉంటే, దానికి బాధ్యత వహించాలి," అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా(Congress MP Priyanka Gandhi Vadra) మీడియాతో అన్నారు.






