14 March, 2026 | 1:31 AM

15న ఇందిరాపార్క్ వద్ద ఫీజుల పోరు దీక్ష

14-03-2026 12:23 AM
  1. ఫీజు దీక్షతో కాంగ్రెస్  ప్రభుత్వ కళ్లు తెరిపిస్తం
  2. ఫీజు దీక్షకు హాజరుకానున్న అఖిలపక్ష పార్టీల నేతలు
  3. బీసీ విద్యార్థి నేతలు విక్రమ్ గౌడ్, మహేష్ యాదవ్‌ల వెల్లడి

ముషీరాబాద్, మార్చి 13(విజయక్రాంతి): గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న 7500 కోట్ల ఫీజుల రీయింబర్స్ మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఫీజుల రీయింబర్స్ మెంట్ పథకాన్ని పూర్తిగా అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ తో ఈనెల 15న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ఫీజు పోరు దీక్షకు అఖిలపక్ష పార్టీల నేతలను ఆహ్వానించామని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ లు వెల్లడించారు.

ఈ మేరకు శుక్రవారం హైదరాబాదులోని బీసీ భవన్ రాష్ట్ర కార్యాలయంలో ఈనెల15న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఫీజు పోరు దీక్ష సన్నాహక సమావేశం జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో దీక్షకు సంబంధించిన వివరాలను విక్రమ్ గౌడ్, మహేశ్ యాదవ్ లు వెల్లడించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 16 నుండి జరిగే బడ్జెట్ సమావేశాలలో ఫీజుల రీయింబర్స్మెంట్ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈనెల 15న హైదరాబాద్ లోని ఇంద్ర పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుండి జరిగే ఫీజు పోరు దీక్షకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ,

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్, మధుసూదనా చారి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎల్. రమణ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు, నెల్లికంటి సత్యం, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, ఎంఐఎం నుండి అక్బరుద్దీన్ ఓవైసీ, బీఎస్పీ నుండి ఇబ్రహీం శేఖర్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, జనసేన అధ్యక్షులు శంకర్ గౌడ్, వివిధ బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు,

విద్యావేత్తలు, మేధావులు, అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, ఓయూ జేఏసీ నేతలు హాజరుకానున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు ఇంద్రం రజక, పుల్లెంల శివ గౌడ్, వినయ్, బండి గారి రాజు, గూ డూరు భాస్కర్ మేరు, వంశీ, ఆవుల శ్రీను, ఎ. వెంకటేష్, ఎ. నరేష్, ఆవుల రాములు తదితరులు పాల్గొన్నారు.