రీ సర్వేతో ప్రభుత్వ భూముల పరిరక్షణ
మహబూబాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ రీసర్వే యొక్క ముఖ్య ఉద్దేశమని, ప్రజలు, రైతులు సర్వే బృందాలకు సహకరించి తమ భూములకు సంబంధించిన సరైన వివరాలను అందించాలని కలెక్టర్ స్నేహ శబరిష్ కోరారు. రీసర్వేలో భాగంగా ప్రభుత్వ, ఆబాది , పట్టాదార్ భూముల సర్వే ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
శుక్రవారం జిల్లాలోని దంతాలపల్లి మండలం, కాల్వపల్లిలో జరుగుతున్న క్షేత్రస్థాయి సర్వే పనులను స్వయంగా మండల సర్వేయర్ శ్రీ నిత్యతో కలిసి బైక్ పై వెళ్లి తనిఖీ చేసి, పలు సూచనలు చేశారు. జిల్లాలో 77 గ్రామాల సర్వేకు గెజిట్ ప్రతిపాదన వచ్చిందని, అందులో భాగంగా దశలవారీగా సర్వే కొనసాగుతుందని, మొదటి దశలో 11 గ్రామాలలో సర్వే ప్రారంభమైందని, ఆబాది, ప్రభుత్వ భూముల, పట్టేదారు భూములను ముందస్తు సమాచారంతో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని, సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో పనులు పూర్తి చేయాలని రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు.
సరిహద్దు వివాదాలు తలెత్తకుండా సర్వే నిర్వహించే సమయంలో సంబంధిత భూయజమానులు పొరుగు భూముల యజమానుల సమక్షంలోనే కొలతలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాది స్థలాలు, ప్రభుత్వ భూములను ఖచ్చితమైన కొలతలతో రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు.
సర్వే పనులను వేగవంతం చేసేందుకు మరియు ఖచ్చితమైన సరిహద్దులను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ సర్వేయర్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, ఆర్డీవో గణేష్, తాహసిల్దార్ సునీల్ రెడ్డి, ఎంపీడీవో సక్రియ, తదితరులు పాల్గొన్నారు.






