నిరుద్యోగ సమస్యను తక్షణమే పరిష్కరించాలి
పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్శక రవి డిమాండ్
గుండాల,(విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని, ప్రతి సంవత్సరం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమయిందని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి దర్శక రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం మండల కేంద్రంలో జరిగిన పీవైఎల్ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు నాలుగు వేలు కల్పిస్తామని, రుణాలు ఇస్తామని దరఖాస్తులు తీసుకొని నేటి వరకు ఇవ్వలేక పోయారని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి జాబ్ క్యాలండర్ ప్రకటిస్తామని ఇప్పటివరకు ప్రకటించక లేకపోయారని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు తాటి రమేష్, కల్తి ప్రమోద్, మండల నాయకులు మోకాళ్ళ పోతయ్య, అరెం రామారావు, ఈసం సుధాకర్, ఇసం రమేష్, కల్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.




