31 July, 2026 | 3:26 PM

విద్యార్థుల జీవితాలతో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు చెలగాటం

31-07-2026 02:09 PM

ప్రైవేట్ పాఠశాల అమ్మకంపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన 

మంథని చౌరస్తాలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

మంథని,(విజయక్రాంతి): విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ పాఠశాలలను విద్యా సంవత్సరం మధ్యలో విక్రయించారనే అపవాదితో మంథనిలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కొంత ఆందోళనకు లోనయ్యారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఫీజులు వసూలు చేసి, పుస్తకాలు, యూనిఫాంలు కొనుగోలు చేయించిన అనంతరం ఒక్కసారిగా పాఠశాల యాజమాన్యాన్ని మార్చారనే వదంతులు కొందరు కావాలని చేసిన అవగతం అవుతుంది. ఈ వదంతుతో  విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు.

పాఠశాల పేరును, యాజమాన్యాన్ని మార్చే ముందు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం, వారి అభిప్రాయాలు తీసుకోవడం, విద్యాశాఖ అనుమతులతో పారదర్శకంగా వ్యవహరించడం అవసరమని నీ పేరెంట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒక పాఠశాలలో చేరిన విద్యార్థులు అక్కడి ఉపాధ్యాయులు, బోధనా విధానానికి అలవాటు పడతారని  మధ్యలో యాజమాన్యం మారడం, మరో పాఠశాలలో విలీనం చేయడం వల్ల వారి చదువుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని మంథని చౌరస్తా లో శుక్రవారం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా ఫీజుల నిర్మాణం, రవాణా, యూనిఫాంలు, పుస్తకాలు వంటి అంశాల్లో కూడా అదనపు భారం పడే పరిస్థితి నెలకొంటుందని పేరెంట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య మార్పులు, విక్రయాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని తీసుకురావాలని, విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాలలను విక్రయించకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.