ఆలయ నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి
సర్పంచ్ సతీష్
వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని చిన్న వాంకిడి గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన హనుమాన్ మందిర్ నిర్మాణ పనులను బుధవారం వాంకిడి సర్పంచ్ సిహెచ్. సతీష్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా గ్రామ ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు. గ్రామస్తుల సహకారంతో జరుగుతున్న ఈ నిర్మాణం ప్రతి ఒక్కరికి గర్వకారణమని పేర్కొన్నారు.
అలాగే, నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, దీర్ఘకాలం నిలిచే విధంగా చేపట్టాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. అవసరమైన చోట ఇంజినీరింగ్ సలహాలు తీసుకుని పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామ ప్రజల భాగస్వామ్యం ఉండటం వల్ల ఈ ఆలయం మరింత విశిష్టంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాభివృద్ధి కోసం ఇలాంటి సామూహిక కార్యక్రమాలు మరింతగా చేపట్టాలని, యువత కూడా ముందుకు రావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాంకిడి మాజీ సర్పంచ్ బండ తుకారం, శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




