నేడు నల్లమల్లలో మంత్రుల పర్యటన
అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోనీ నల్లమలలో గురువారం రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ లు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రులు అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని పదర మండలం మద్దిమడుగు గ్రామానికి చేరుకుని, ప్రసిద్ధ మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయం లో స్వామి దర్శనం చేసుకోనున్నారు.
అనంతరం అక్కడే అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. పర్యటన షెడ్యూల్ ప్రకారం, మంత్రులు హైదరాబాద్‌లోని మంత్రి నివాసం నుండి ఉదయం 08-10,బయలుదేరి, బేగంపేట్ విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా ప్రయాణం ప్రారంభించి, ఉదయం 8:30 గంటలకు మద్దిమడుగు గ్రామానికి చేరుకోనున్నారు. మంత్రుల పర్యటన సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.




