20 May, 2026 | 3:04 AM

పాలమూరుకు ప్రాధాన్యత

20-05-2026 01:05 AM

భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.. పాలమూరు జిల్లా నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకుతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మిగతా  ప్రాజెక్టులను సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి, యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఎంసీహెచ్‌ఆర్డీలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆయన పలు కీలక సూచనలు చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలయినంత త్వరగా భూసేకరణ పూర్తిచేయాలని ఆదేశించారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని సీఎం పేర్కొన్నారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టంచేశారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు  సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఈ భేటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధు సూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, రాజేశ్ రెడ్డి,  వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.