ఆపదలో అండగా ఉంటాం
- పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం లో వర్కింగ్ జర్నలిస్టులందరూ సభ్యులుగా నమోదు చేసుకోవాలి
- శాశ్వత సభ్యత్వానికి రూ. వెయ్యి రుసుము
- ప్రతి జర్నలిస్టుకు భరోసా ఉండాలన్నదే ఎమ్మెల్యే యెన్నం సంకల్పం
- సభ్యులందరికీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సౌకర్యం
- మీడియా సమావేశంలో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వాకిట అశోక్, కుమార్ మల్లు మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): వర్కింగ్ జర్నలిస్టులందరికీ మేమున్నాం అంటూ భరోసానివ్వడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం పనిచేస్తుందని సంఘం అధ్యక్షుడు వాకిట అశోక్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్ భవన్ లో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం విధివిధానాలు రూపకల్పన కమిటీ తదితర విషయాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు 15 మంది సభ్యులతో సంఘం గా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేసి పకడ్బందీగా విధివిధానాలు రూపొందించినట్లు వెల్లడించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వర్కింగ్ జర్నలిస్టులందరినీ అన్ని కేటగిరీలు, విభాగాల వారిని సంఘం లో సభ్యులుగా చేర్చుకొని ఆపద సమయంలో వారికి అండగా ఉంటామని తెలిపారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు అందరూ రూపాయలు వెయ్యి చెల్లించి సంఘంలో శాశ్వత సభ్యత్వం పొందాలని కోరారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కార్యదర్శి మల్లు మధుసూదన్ రెడ్డి సంఘం విధివిధానాలను వివరించారు.
- ఏదైనా కారణం చేత వర్కింగ్ జర్నలిస్టు మరణించిన యెడల బాధిత కుటుంబ సభ్యులకు 25 వేల తక్షణ ఆర్థిక సాయం..
- వికలత్వం శాశ్విత వైకల్యం ఏర్పడినప్పుడు అత్యవసర వైద్య పరిస్థితుల్లో బాధపడుతున్న వారికి రూ.25 వేల ఆర్థిక సాయం
- అనుకోని పరిస్థితుల్లో జర్నలిస్టు మరణించిన ఎడల వారి పిల్లల విద్యకు రూపాయలు 20,000 ఆర్థిక సాయం
- ఏదైనా యాక్సిడెంట్ ప్రమాదం జరిగినప్పుడు తీవ్రతను బట్టి రూపాయలు 10,000 నుంచి 50 వేల వరకు ఆర్థిక సాయం.
ఇలా జర్నలిస్టులకు ఆపత్కాలంలో అండగా నిలుస్తూ ఆర్థిక భరోసాను అందించడమే కాకుండా పరిస్థితులను బట్టి ఆర్థిక సాయం విషయంలో అందరి సభ్యులు జర్నలిస్టుల సూచనలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా పాలమూరు సంక్షేమ సంఘానికి తొలి చెక్కు రూపాయలు లక్ష అందజేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి సమావేశంలో సభ్యులందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం ప్రతి నెల రూ. లక్ష అందజేయడం చాలా గొప్ప విషయం అని పేర్కొన్నారు. మహబూబ్నగర్ లోని వివిధ వ్యాపార వాణిజ్య విద్య వేత్తలు వివిధ సంఘాల ప్రముఖులు ముందుకు వచ్చి జర్నలిస్టుల సంక్షేమానికి ఆర్థిక సాయం అందజేయాలని ఈ సందర్భంగా సభ్యులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కోశాధికారి జిల్లెల రఘు, ఉపాధ్యక్షులు పల్లె ముని యాదయ్య, సహాయ కార్యదర్శి ఎం తిరుపతయ్య, కార్యవర్గ సభ్యులు కే రమాకాంత్ రెడ్డి, సతీష్ కుమార్, కే కేశవులు, సంతోష్ కుమార్, సతీష్ కుమార్ రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.




