సమ్మిళిత విద్యకు ప్రశస్త్..!
- ప్రత్యేక అవసరాల విద్యార్థుల గుర్తింపు..
- స్కూళ్ళలోనే డిజిటల్ స్క్రీనింగ్
పటాన్చెరు, ఆగస్టు 19 : సంగారెడ్డి జిల్లాలో ’ప్రశస్త్’ యాప్ ద్వారా సమ్మిళిత విద్య సరికొత్త పుంతలు తొక్కుతోంది. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ- 2020) మార్గదర్శకాల ప్రకారం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రాథమిక దశలోనే గుర్తించి సాధారణ విద్యార్థులతో పాటు సమాన విద్యా అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతంగా కొనసాగుతున్న సమ్మిళిత విద్యా విప్లవంపై ప్రత్యేక కథనం..
కేంద్ర విద్యాశాఖ, ఎన్సీఈఆర్టీ సంయుక్తంగా రూపకల్పన చేసిన డిజిటల్ స్క్రీనింగ్ టూల్ ఇది. దీని ద్వారా ఉపాధ్యాయులు పాఠశాల స్థాయిలోనే వైకల్యాలు లేదా అభ్యసన లోపాలు ఉన్న విద్యార్థులను సులభంగా గుర్తిస్తారు. సుమారు 21 రకాల వైకల్యాలను (దివ్యాంగత్వాలను) గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
స్క్రీనింగ్ ప్రక్రియ..
ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నల ఆధారంగా యాప్లో పిల్లల ప్రవర్తన, అభ్యసన సామర్థ్యాలను నమోదు చేస్తారు. సంగారెడ్డి జిల్లాలోని 26కు పైగా మండలాల్లో గల ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది.
జిల్లా విద్యాశాఖ ద్వారా ఉపాధ్యాయులకు ’ప్రశస్త్’ యాప్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. సాధారణ విద్యార్థులతో పాటు వెనుకబడిన లేదా శారీరక, మానసిక సవాళ్లు ఎదుర్కొంటున్న పిల్లలను గుర్తించి యాప్లో డేటాను అప్లోడ్ చేస్తున్నారు. స్కూల్ టీచర్లు స్క్రీనింగ్ చేసిన తర్వాత లోపాలు, అంధత్వం, వినికిడి లోపం, ఆటిజం వంటి సమస్యలున్న పిల్లలను భవిత కేంద్రాలు లేదా సహారా ఇన్క్లూసివ్ స్కూల్ వంటి ప్రత్యేక నిపుణులు పునర్ పరిశీలిస్తారు.
సమ్మిళిత విద్య వల్ల కలిగే ప్రయోజనాలు...
ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రత్యేక పాఠశాలలకు పరిమితం చేయకుండా, సాధారణ పాఠశాలల్లో అందరితో కలిపి చదివించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. యాప్ ద్వారా నమోదైన విద్యార్థులకు ప్రభుత్వ సాయంతో వీల్చైర్లు, వినికిడి యంత్రాలు, స్మార్ట్ స్టిక్స్, ఉచిత రవాణా భత్యం అందుతాయి. పరీక్షల్లో అదనపు సమయం కేటాయించడం, స్క్రైబ్ (సహాయకుడు) సౌకర్యం కల్పించడం వంటివి సులువవుతాయి.
జిల్లాలో ఎదురవుతున్న సవాళ్లు...
గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత (ర్యాంప్లు, ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడం) సమ్మిళిత విద్యకు కొంత ఆటంకంగా మారుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న మోడల్ పాఠశాలలు, సమగ్ర శిక్షా అభియాన్ నిధుల ద్వారా సంగారెడ్డిలోని పాఠశాలల మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం కలిసికట్టుగా అడుగులు వేస్తేనే ‘అందరికీ సమాన విద్య - అందరికీ సమ్మిళిత అభ్యసనం‘ అనే లక్ష్యం వంద శాతం సాకా రమవుతుంది.






