10 March, 2026 | 3:43 PM

షాద్‌నగర్‌లో ఉత్సాహంగా '5కే రన్'

09-03-2026 12:32 PM

ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

షాద్‌నగర్(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 ప్రణాళిక కార్యాచరణలో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో 5కే రన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ​​పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ 5కే రన్, షాద్‌నగర్ ముఖ్య కూడలి వరకు సాగింది. ఆరోగ్య అవగాహన, ప్రభుత్వ లక్ష్యాల సాధన ధ్యేయంగా సాగిన ఈ పరుగులో విద్యార్థులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మార్గమధ్యలో యువత ఉత్సాహంగా నినాదాలు చేస్తూ పరుగును కొనసాగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళికల్లో ప్రజలను, ముఖ్యంగా యువతను భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు ఇలాంటి క్రీడా కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు వివరించాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ​ఈ కార్యక్రమంలో హాజరైన మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.