నాగోబాకు శిక్షణ ఐఏఎస్ అధికారుల పూజలు
ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించిన శిక్షణ ఐఏఎస్ అధికారులు
ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దేవుడు నాగోబాను 2025 శిక్షణ ఐఏఎస్ అధికారులు నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఉట్నూర్ నుండి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా ఆలయానికి చేరుకున్నారు. నాగోబా పూజలకు హాజరైన శిక్షణ ఐఏఎస్ అధికారులను ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనందరావు ఆదివాసి సాంప్రదాయంగా స్వాగతం పలికారు. నాగోబా దేవుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఐఏఎస్ అధికారులను శాలులతో సన్మానించి నాగోబా దేవుడి ప్రసాదాన్ని ఆలయ పీఠాధిపతి అందించారు.
నాగోబా దేవుడి చరిత్ర, నాగోబా జాతర సందర్భంగా ఆదివాసుల పూజా విధానం పై ఐఏఎస్ అధికారులు ఆలయ పీఠాధిపతిని అడిగి తెలుసుకున్నారు. నాగోబా జాతర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నివాసముండే మెస్రం వంశరసులతోపాటు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్గడ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివాసమున్న మెస్రం వంశీయులు హాజరవుతారని ఐఏఎస్ అధికారులకు ఆలయ పీఠాధిపతి వెంకటరావు వివరించారు. నాగోబా దేవుడి పూజలు ముగిసే వరకు 45 రోజుల సమయం పడుతుందని, నాగోబా అభిషేకానికి అవసరమయ్యే గంగా జలాని కోసం 14 రోజులపాటు కొనసాగుతుందని వివరించారు.
గంగాజలం సేకరణ కోసం మెస్రం వంశీయులు తెల్లని బట్టలు ధరించి గంగా జలాని కోసం పాదయాత్రగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామ శివారులోని గోదావరికి వెళ్లి గోదావరిని అస్తినామడుగు నుండి గంగాజలం సేకరించి తీసుకువస్తారని వివరించారు. నాగోబా ఆలయాన్ని మెస్రం వంశీయుల చందాలతో రూ.ఐదు కోట్లతో నిర్మించడం జరిగిందని వారికి వివరించారు. దేశంలో ఇంతవరకు ఒకే వంశస్థులు ఐదు కోట్లు ఖర్చుపెట్టి ఎక్కడ నిర్మించినట్టు రుజువులు లేవని, కేవలం నాగోబా ఆలయ నిర్మాణమే సాక్షమని ఆదివాసులు ఐఏఎస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
* అమరులకు ఐఏఎస్ అధికారుల నివాళులు..
ఇంద్రవెల్లి మండలంలో 2025 శిక్షణ ఐఏఎస్ అధికారులు హరి ప్రసాద్, సాయి సురేష్, సాయి శివాని, శ్రీకాంత్ రెడ్డి, సచిన్ బసవరాం గుప్తా, పరస్ కుమార్ ఇంద్రవెల్లి లోని గిరిజన అమరవీరుల స్తూపం వద్ద వారికి నివాళులర్పించారు. ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20 న జరిగిన సంఘటన వివరాలను ఆదివాసీ నాయకుడు మెస్రం నాగ నాథ్ ను అడిగి తెలుసుకున్నారు. 1981 లో జరిగిన సంఘటన నుండి సీఎం రేవంత్ రెడ్డి స్మారక సూపం వద్ద ఏర్పాటుచేసిన పార్క్ వరకు అధికారులకు వివరించారు. అధికారుల వెంట ఐటీడీఏ ఏపీవో, ( జనరల్) వసంతరావు జాదవ్, ఏపీఓ పిటిజి ఆత్రం భాస్కర్, ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం ఈ ఈ తానాజీ జాదవ్, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఐటిడి అధికారులు పాల్గొన్నారు.






