సబ్ స్టేషన్‌లో దగ్ధమైన పవర్ ట్రాన్స్ ఫార్మర్..!
- బుష్ లేటర్ వద్ద ఆయిల్ లీకై చెలరేగిన మంటలు
- రూ. 57 లక్షల ఆస్తి నష్టం
మిర్యాలగూడ, మే 3 : మిర్యాలగూడ మండల పరిధి వెంకటాద్రిపాలెం సబ్ స్టేషన్ లో ఆదివారం సాయంత్రం మెగా వోల్ట్ ట్రాన్స్ ఫార్మర్ దగ్ధమైన సంఘటన జరిగింది. మిర్యాలగూడ విద్యుత్ డీఈ శ్రీనివాసచారి, ఏడి కోడి రెక్క రవికుమార్, మండల ఏఈ అమర్ సింగ్ నాయక్ లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాద్రిపాలెం ఇండస్ట్రియల్ ఏరియా సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న పవర్ ట్రాన్స్ ఫార్మర్ బుష్ లేటర్ నుంచి ఆయిల్ లీకై అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో మంటలు చెలరేగినట్లు తెలిపారు.
మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ ఇంజన్ సబ్ స్టేషన్ వద్దకు చేరుకునే లోపే పెద్ద ఎత్తున మంటలు వచ్చి ట్రాన్స్ ఫార్మర్ 80 శాతం కాలి పోయిందన్నారు. ఈ ప్రమాదంలో 57 లక్షల ఆస్తి నష్టం వచ్చినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మంటలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఓవైపు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో వచ్చిన వర్షంతో పూర్తిగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.






