9 April, 2026 | 2:23 AM

కాలుష్యం, రోగాలు మాకు.. అభివృద్ధి మీకా ?

09-04-2026 12:21 AM
  1. సీఎస్‌ఆర్ నిధుల తరలింపుపై ఎమ్మెల్యే జీఎంఆర్ ఆగ్రహం

జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

పటాన్ చెరు, ఏప్రిల్ 8 : ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల సిఎస్‌ఆర్ నిధులను స్థానిక అభివృద్ధి పనుల కోసం కేటాయించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకు వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పచ్చటి పొలాలు, మూడు పంటలు పండే భూములు, స్వచ్ఛమైన గాలి, అందమైన తమ పల్లెల పరిధిలో అభివృద్ధి కోసం నూతన పరిశ్రమలు ఏర్పాటు అయితే తమ గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానికంగా ఉపాధి లభిస్తుందన్నఆశలతో పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలు 70వ దశకంలో  పరిశ్రమల ఏర్పాటునకు స్వాగతం పలికారని తెలిపారు.

పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్, పాశమైలారం, పటాన్ చెరు, జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం, కాజీపల్లి, కిష్టాయపల్లి, బొల్లారం, గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి, గుమ్మడిదల, అమీన్ పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, గండి గూడెం, దాయర గ్రామాల పరిధిలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటయ్యాయని చెప్పారు.

కాలుష్యం మూలంగా వ్యాధులకు గురవుతున్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తో పాటు ఇస్నాపూర్ పెద్ద చెరువు, గండిగూడెం, ఆసాని కుంట, కిష్టారెడ్డిపేట చెరువుల పరిధిలో సీవరేజ్ ట్రీట్మెంట్ సైతం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.  కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, దశరథ్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.