10 August, 2026 | 9:39 PM

కాళేశ్వరంలో బెల్ట్‌ షాపులు మూసివేయాలి

10-08-2026 08:09 PM

యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్న మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాలి

కాళేశ్వరం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదాపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్‌ షాపులను తక్షణమే మూసివేయాలని ఎమ్మార్పీఎస్‌ ప్రధాన కార్యదర్శి లేతకారి రాజశేఖర్ డిమాండ్‌ చేశారు. గ్రామంలో 24 గంటలు మద్యం అందుబాటులో ఉండటంతో యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌ షాపులపై పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు వెంటనే దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం-మహాదేవపూర్‌ రహదారిలోని కొన్ని బెల్ట్‌ షాపుల్లో కల్తీ మద్యం, గుడుంబా విక్రయిస్తున్నారనే ఆరోపణలపై కూడా అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే బెల్ట్‌ షాపులపై ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని లేతకారి రాజశేఖర్‌ హెచ్చరించారు.