10 August, 2026 | 9:53 PM

రామప్ప సరస్సు నీటితో గణపసముద్రం నింపండి

10-08-2026 08:39 PM

8 మండలాలకు త్రాగునీరు అందేలా చూడాలి 

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

మంత్రి సీతక్క, ఐబీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే

గణపురం,(విజయక్రాంతి): రామప్ప నీటితో తాగునీటి సమస్యను పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రామప్ప సరస్సు నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా గణపురం మండలంలోని బుద్ధారం వంగపల్లి వాణి చెరువు నింపిన అనంతరం గణప సముద్రానికి నీటిని తరలించి భూపాలపల్లి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందేలా చూడాలని సమావేశంలో ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

ఎల్‌నినో ప్రభావం వల్ల తగినంత వర్షపాతం లేక రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని రామప్ప చెరువు నుండి వంగపెల్లి వాని చెరువు మార్గంగా గణప సముద్రం చెరువులోకి నీటిని విడుదల చేసే అంశాన్ని అధికారులు పరిశీలించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన అనుమతులు పొందాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు.

రామప్ప చెరువు నుంచి నీటి విడుదల జరిగితే భూపాలపల్లి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా మెరుగుపడుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ప్రజలకు తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సీతక్క ఆదేశించారు.