10 August, 2026 | 9:40 PM

నిండు కుండగా మారిన ఎల్లయ్య చెరువు

10-08-2026 08:28 PM

ఇటీవల తీసిన పూడికతీత ఫలితం

పెరిగిన భూగర్భ జలాలు.. టీచర్స్ కాలనీ వాసుల హర్షం

ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్ చైర్మన్ కాసులకు కాలనీ వాసులు కృతజ్ఞతలు

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల ఎల్లయ్య చెరువు ఎన్నో దశాబ్దాలుగా పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయిన పరిస్థితి నెలకొని ఉండే, ఇటీవల చేపట్టిన పూడికతీత పనుల ఫలితంగా చెరువులో నీటి నిల్వ గణనీయంగా పెరగడంతో పాటు, భూగర్భ జలాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో  ప్రస్తుతం జలసిరితో కళకళలాడుతోంది. దీంతో స్థానిక ప్రజలు, కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సుమారు 75 సంవత్సరాలుగా పూడికతీతకు నోచుకోని ఎల్లయ్య చెరువుకు పూడికతీత పనులు చేపట్టడం పట్టణ అభివృద్ధిలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ లు పట్టణ అభివృద్ధి ధ్యేయంగా భవిష్యత్తులో ప్రజల అవసరాలను దూరదృష్టితో కూడిన నిర్ణయం తీసుకోవాలని ఎల్లయ్య చెరువుకు కొత్త రూపాన్ని తీసుకువచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు.

చెరువుల పూడికతీత అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ ఇంత పెద్ద మహోన్నతమైన కార్యక్రమాన్నీ పూర్తిస్థాయిలో పూడిక తీయడం సాధారణంగా సులభమైన విషయం కాదని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని ప్రజలు పేర్కొంటున్నారు. పూడికతీత పనులు జరుగుతున్న సమయంలో రాజకీయ లబ్ధి కోసం కొందరు అనవసర వివాదాలు, అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించినప్పటికీ, వాటిని పక్కనబెట్టి ప్రజాహితమే లక్ష్యంగా పనులను పూర్తి చేయడం ప్రశంసనీయమని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో భూగర్భ జలాలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీచర్స్ కాలనీ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల పరిస్థితి మెరుగుపడటంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని బావులు, బోర్లు నీటితో నిండే అవకాశం ఉండటంతో పాటు రైతులు, పశువులు, గ్రామ ప్రజలకు కూడా దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని వారు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ లకు ప్రజలు కాలనీవాసుల తరపున, కౌన్సిలర్ ఖాలెక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.