12 June, 2026 | 2:30 AM

ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ ఆరోపణలు తగవు

12-06-2026 12:00 AM

డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య

జగిత్యాల, జూన్ 11 (విజయక్రాంతి) : రాష్ట్రంలో జరుగుతున్న వరి ధాన్యం కొనుగోళ్లపై కొందరు నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని మోతే పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నందయ్య మాట్లాడుతూ, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్లు వరి ధాన్యం కొనుగోళ్లలో రూ.107 కోట్లకు పైగా అవినీతి జరిగిందని చేస్తున్న ఆరోపణలు నిరాధారమని అన్నారు.

ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడటం కంటే సంబంధిత ఆధారాలను బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు. గతంలో కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమ్పా అదే తరహా విమర్శలు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందన్నారు. ఒకప్పుడు ఒక మంత్రిని, ఇప్పుడు మరో మంత్రిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం లారీలకు జీపీఎస్ విధానాన్ని అమలు చేయడం, దానిపై రవాణా రంగంలో తలెత్తిన సమస్యలు, అనంతరం ఆ విధానంపై జరిగిన చర్చల కారణంగా ధాన్యం రవాణాలో కొంత ఆలస్యం చోటుచేసుకుందని వివరించారు. ఈ పరిపాలనా కారణాలను పక్కనబెట్టి భారీ కుంభకోణంగా ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన సమయంలో రాజకీయ విమర్శలతో వాతావరణాన్ని కలుషితం చేయడం బాధ్యతారాహిత్యమని నందయ్య విమర్శించారు.  ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.