6 June, 2026 | 9:17 PM

రైతుల వడ్లు రక్షించిన పోలీసులు

06-06-2026 08:13 PM

- 491 బస్తాల ధాన్యంతో రాజస్థాన్  పరారైన డీసీఎం డ్రైవర్ అరెస్ట్ 

- విలేకరుల సమావేశంలో గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు

గజ్వేల్: తిప్పారం గ్రామ రైతులకు చెందిన 491 వరి ధాన్యపు బస్తాలతో పరారైన డీసీఎం డ్రైవర్‌ను రాజస్థాన్‌లో అరెస్ట్ చేసి, ధాన్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు తెలిపారు. ఈ మేరకు శనివారం గౌరారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. కుకునూరుపల్లి మండలంలోని తిప్పారం గ్రామానికి చెందిన 8 మంది రైతుల నుంచి సేకరించిన 196 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రం నుంచి వర్గల్‌లోని మహాదేవ్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు తరలించేందుకు రాజస్థాన్‌కు చెందిన డీసీఎం వాహనాన్ని అద్దెకు తీసుకున్నట్లు సీఐ తెలిపారు.

మిల్లులో పార్కింగ్ ప్రదేశంలో నిలిపిన అనంతరం డ్రైవర్ దశరథ్ సింగ్ రైతులకు చెందిన సుమారు రూ.4 లక్షల విలువైన 491 ధాన్యపు బస్తాలతో అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు. రైతుల ఫిర్యాదు మేరకు గౌరారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ ఐపీఎస్ ఆదేశాలతో గజ్వేల్ ఏసీపీ నరసింహులు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.

సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారంతో నిందితుడు రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. నిందితుడి వద్ద నుంచి రైతుల వరి ధాన్యంతో పాటు డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకుని గౌరారం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చామని సీఐ  తెలిపారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరుస్తామన్నారు. రైతుల కష్టార్జిత పంటను తిరిగి అందించేందుకు కృషి చేసిన గౌరారం, కుకునూరుపల్లి పోలీసు సిబ్బందిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అభినందించినట్లు వెల్లడించారు.