1 August, 2026 | 9:23 PM

మొయినాబాద్ మున్సిపల్ కౌన్సిల్‌లో కీలక నిర్ణయాలు

01-08-2026 08:21 PM

- రూ.4.25 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం

మొయినాబాద్,(విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం చైర్‌పర్సన్ అధ్యక్షతన జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక తీర్మానాలకు ఆమోదం లభించింది. సమావేశానికి ముందు అజీజ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన కౌన్సిల్ మీటింగ్ హాల్, చైర్‌పర్సన్ ఛాంబర్‌ను ప్రారంభించారు. సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, గ్రావెలింగ్, ప్యాచ్‌వర్క్ తదితర అభివృద్ధి పనులకు సుమారు రూ.4.25 కోట్ల ప్రతిపాదనలను ఆమోదించారు.

పారిశుధ్య నిర్వహణ కోసం జేసీబీ, జెట్టింగ్ మిషన్, ఇతర యంత్ర పరికరాల కొనుగోలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీల నిర్వహణ, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు, స్వచ్ఛ భారత్ మిషన్ పనులు, వనమహోత్సవం, బోనాల ఏర్పాట్లు, మున్సిపల్ ఆస్తుల డిజిటల్ మ్యాపింగ్ వంటి ప్రతిపాదనలకు కూడా కౌన్సిల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులు నిర్ణయించారు.