8 July, 2026 | 1:33 PM

బాలికపై హత్యాచారం: ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ప్రభాస్ హతం

08-07-2026 12:09 PM

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్(West Bengal) రాష్ట్రం బరుయిపూర్‌లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ప్రభాస్ మోండల్ బుధవారం తెల్లవారుజామున జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, అర్ధరాత్రి సుమారు 12:45 గంటలకు బరుయిపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక బృందం, నేరం జరిగిన సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ (crime scene reconstruction) కోసం ప్రభాస్ మోండల్‌ను బరుయిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యాపూర్‌కు తీసుకెళ్లింది.

ఈ ప్రక్రియ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు, మోండల్ ఒక పోలీసు అధికారి సర్వీస్ తుపాకీని లాక్కొని, పోలీసు బృందంపై ఒక రౌండ్ కాల్పులు జరిపి, అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడు ప్రభాస్ మోండల్ పారిపోతుండగా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ప్రభాస్ మోండల్ బాలికపై హత్యాచారం చేసి, బాలికను హత్య చేసి గోనె సంచింలో కుక్కి చెరువులో పడేశాడు. బాలిక హత్యాచారం కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

 నా కొడుకు చేసిన పనికి శిక్ష అనుభవించాడు!

నిందితుడైన ప్రభాస్ మోండల్ తల్లి మీడియాతో మాట్లాడుతూ... "ఇద్దరు పోలీసులు మా ఇంటికి వచ్చారు. అప్పుడే నేను నిద్రలేచాను. నా కొడుకు చనిపోయాడని, ఆసుపత్రికి వస్తారా అని వారు నన్ను అడిగారు. నా భర్త అనారోగ్యంతో ఉన్నందున నేను రాలేనని వారికి చెప్పాను. నాకేమీ అభ్యంతరం లేదు కాబట్టి, వారు చేయాలనుకున్నది చేయమని చెప్పాను. నా కొడుకు చేసిన పనికి శిక్ష అనుభవించాడు. నేను అతని మృతదేహాన్ని స్వీకరించను. అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకురాను. వాడు ఏ మంచి పనీ చేయలేదు. తప్పు చేశాడు, దానికి శిక్ష అనుభవించాడు. వాడిని చంపేయండి లేదా మీకు నచ్చినట్లు చేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. నేను వాడి మృతదేహాన్ని తీసుకోను." అని ఆ తల్లి పేర్కొంది