అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో పోలీసుల ఆధ్వర్యంలో భారీ కార్డెన్ సెర్చ్
150 బైక్‌లు, 30 ఆటోలు 3 కార్లు స్వాధీనం
బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో శనివారం రాత్రి డీఎస్పీ విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ ఎత్తున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సీఐలు, ఎస్ఐలు, ప్రత్యేక బృందాలు సహా సుమారు 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు నివాసితుల వివరాలను సేకరించి ఆధార్ కార్డులను పరిశీలించారు.
అలాగే కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం సేవనం, గంజాయి వినియోగం, మహిళలపై వేధింపులు, ఇతర చట్టవ్యతిరేక చర్యలు జరుగుతున్నాయా అనే అంశాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో మొత్తం వెయ్యికి పైగా ఇళ్లు ఉండగా, సుమారు 500కు పైగా ద్విచక్ర వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా ఆర్‌సీ బుక్‌లు లేని వాహనాలు, ఇతరుల పేర్లపై నమోదైన అనుమానాస్పద వాహనాలను గుర్తించి సుమారు 150 ద్విచక్ర వాహనాలు, 30 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, నేరస్థుల కదలికలను నియంత్రించడమే కార్డెన్ సెర్చ్ ప్రధాన ఉద్దేశ్యం. కొందరు దొంగ వాహనాలను వినియోగిస్తున్నట్లు, గంజాయి మరియు మద్యం సేవిస్తున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టాం అని తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే వాహనాలను తిరిగి అప్పగిస్తామని, పత్రాలు లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
అలాగే గ్యాస్ కనెక్షన్ బుక్ లేకుండా వినియోగిస్తున్న సిలిండర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాలనీలోకి బయటి ప్రాంతాల నుంచి వచ్చే అనుమానాస్పద వ్యక్తులు లేదా నేరచరిత్ర కలిగిన వారు ఎవరైనా ఇబ్బందులు సృష్టిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. కార్డెన్ సెర్చ్ సందర్భంగా పోలీసులు కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మహిళలు పోలీసుల తనిఖీలను స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. పోలీసుల పర్యవేక్షణతో కాలనీలో శాంతిభద్రతలు మరింత మెరుగుపడతాయని వారు అభిప్రాయపడ్డారు.






