పెద్దపల్లిలో నీట్-పీజీ పరీక్షా కేంద్రాల పరిశీలన
భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
పెద్దపల్లి, ఆగస్టు 30(విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలో ఆదివారం నిర్వహించిన నీట్-పీజీ–2026 పరీక్షల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దపల్లి డీసీపీతో కలిసి బండారికుంట సమీపంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా చర్యలను సీపీ పరిశీలించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యతో పాటు వారికి కల్పించిన భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం ప్రశ్నపత్రాలు, ఇతర పరీక్షా సామగ్రిని సురక్షితంగా తరలించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, పెద్దపల్లి జోన్ పరిధిలోని మూడు పరీక్షా కేంద్రాల్లో నీట్-పీజీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వలలోని మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ నిర్వహణతో పాటు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ముగిసిన అనంతరం ప్రశ్నపత్రాలు, ఇతర పరీక్షా సామగ్రిని సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మూడు పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగుతున్నాయని, అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని పోలీస్ కమిషనర్ కోరారు.






