22-02-2026 04:15:35 PM
హైదరాబాద్: నిర్మల్ జిల్లాకు వెళ్తున్న ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లాలోని ఓలా గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రాజా సింగ్ బయల్దేరారు. ఆదివారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లాకు వెళుతుండగా శంకరంపేట వద్ద పోలీసులు అతని కారును అడ్డగించి ముందస్తుగా అదుపులోకి తీసుకుని శంకరంపేట పోలీసు స్టేషన్ కు తరలించారు.
పోలీసుల అహంకార వైఖరిని నిరసిస్తూ, ప్రజలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతిపక్ష పార్టీ సభ్యులను పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని అణచివేస్తోందని రాజా సింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా రాజా సింగ్ మాట్లాడుతూ... తెలంగాణలోని హిందూ వ్యతిరేక, శివాజీ మహారాజ్ వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా ఆపడానికి చట్టవిరుద్ధంగా నిర్బంధించిందని మండిపడ్డారు.