పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు.. రైతుల్లో ఆనందం
అలుగుపై నుంచి 8,292 క్యూసెక్కుల నీటి వరద
20 వేల ఎకరాలకు సాగునీటి భరోసా
మంజీరా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని అలుగుపై నుంచి పొంగిపొర్లుతోంది.ఎగువ ప్రాంతాలైన మంచిప్ప, గాంధారి,లింగంపేట్ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో లింగంపేట్ పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.లింగంపేట్ ప్రధాన వాగు ద్వారా భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది.
పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1464 అడుగులు కాగా, నిల్వ సామర్థ్యం 1.820 టీఎంసీలు.ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో అలుగుపై 1.25 అడుగుల ఎత్తున నీరు పొంగిపొర్లుతోంది.ప్రాజెక్టులోకి 8,292 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, అదే స్థాయిలో 8,292 క్యూసెక్కుల అదనపు వరద నీటిని అలుగుపై నుంచి మంజీరా నదిలోకి వెళ్తుంది.దీంతో ఆయకట్టు పరిధిలోని సుమారు 20 వేల,,ఎకరాలకు ఖరీఫ్ సాగుకు నీటి భరోసా లభించనుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై నిరంతర పర్యవేక్షణ చేపట్టారు.ప్రాజెక్టు పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు ఇరిగేషన్ డీఈఈ కిష్టయ్య తెలిపారు. అలాగే మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.






