18 July, 2026 | 5:57 PM

విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం

18-07-2026 05:57 PM

- PTM లో ప్రిన్సిపల్ బుచ్చన్న

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోవాలన్న, ఉద్యోగాలు పొందాలన్నా ఉపాధ్యాయుల విద్యా బోధనకు విద్యార్థి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా అంతే అవసరమని పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ (PM SRI TGMS) ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న అన్నారు. శని వారం కళాశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్ టీచర్స్ మీటింగ్ (PTM)లో తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఆరు ప్రతిజ్ఞలు చేయాలని, వాటిని ఆచరించాలని కోరారు.

నా బిడ్డను ప్రతిరోజూ పాఠశాలకు పంపుతాననీ, నా బిడ్డ పాఠశాలకు రాకపోతే, ఉపాధ్యాయులకు తప్పకుండా సమాచారం ఇస్తాననీ, నా బిడ్డను ప్రతిరోజూ పాఠశాలలో ఏమి నేర్చుకున్నాడో, ఏమి జరిగిందో అడుగుతాననీ, నా బిడ్డ ప్రతిరోజూ ఇంట్లో చదివేలా చూసుకుంటాననీ, ఈ విద్యా సంవత్సరంలో జరిగే ప్రతి తల్లిదండ్రుల - ఉపాధ్యాయుల సమావేశానికి (PTM) హాజరై, నా బిడ్డ చదువు, ప్రవర్తన గురించి చర్చిస్తాననీ, నెలకోసారి పాఠశాలకు వచ్చి, ఉపాధ్యాయులతో నా బిడ్డ విద్యా పురోగతి గురించి వ్యక్తిగతంగా చర్చిస్తాననీ, ఈ ఆరు ప్రమాణాలు పాటిస్తానని తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరం కలిసి ప్రతి విద్యార్థి విజయం సాధించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.