మే 20న మెడికల్ షాపులు బంద్ కు సహకరించాలి
మంగపేట(విజయక్రాంతి): ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ ( ఏఐఓసీడీ ) ఇచ్చిన దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పిలుపులో భాగంగా మే 20న మంగపేట మండలంలో చేపట్టనున్న మెడికల్ షాపుల బందుకు ప్రజలందరూ సహకరించాలని మంగపేట మండల మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు బర్ల సంజీవరెడ్డి అన్నారు. మే 20న మంగపేట మండలంలో మెడికల్ షాపులు బంద్ విషయంపై మంగపేట మండల మెడికల్ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మంగపేట తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ తోట రవీందర్ కు, మంగపేట పోలీస్ స్టేషన్ లో మంగపేట సెకండ్ యస్ఐ శ్రీకాంత్ కు వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా బర్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌లో నకిలీ, ప్రమాదకర మందులు సరఫరా చేస్తున్నారని, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ లో మందుల అమ్మకాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీల భారీ డిస్కౌంట్లను ఆపాలని, కల్తీ ఔషధాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. నియంత్రణ లేని ఆన్‌లైన్ విక్రయాల వల్ల రోగుల ఆరోగ్య భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు బర్ల సంజీవరెడ్డి , ప్రధాన కార్యదర్శి సామల సాంబశివరావు, కోశాధికారి వి.శ్రీనివాసరెడ్డి, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.






