కళలు విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తాయి
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కళలు విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటానికి మూలమని, విద్యార్థులు వీటిని నిరంతరం సాధన చేయడం ద్వారా మంచి ప్రతిభను ప్రదర్శించవచ్చని జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్. శంభు ప్రసాద్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో మే 11 నుండి జరుగుతున్న విద్యా వారోత్సవాలలో భాగంగా ఈరోజు జిల్లా స్థాయిలో కళలు, హస్తకళలు, సాంస్కృతిక కార్యక్రమాల దినోత్సవం కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి 70 మంది విద్యార్థులు పాల్గొని డ్రాయింగ్, క్రాఫ్ట్, మరియు సాంస్కృతిక ప్రదర్శనల పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యా వారోత్సవాలలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉన్న వివిధ రకాలైన కళలను వెలికితీయటానికి ప్రధానమైన వేదిక అని దీనిని విద్యార్థిని విద్యార్థులందరూ వినియోగించుకుని వారి ప్రతిభను ప్రదర్శింపజేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతి ప్రధానం జరిగింది. సాంస్కృతిక ప్రదర్శనలలో ప్రథమ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్ష్మీదేవి పల్లెకు చెందిన కే సరస్వతి, ద్వితీయ బహుమతి కేజీబీవీ జూలూరుపాడు బృందం, తృతీయ బహుమతి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పాల్వంచకు చెందిన పి జస్విత సాధించగా డ్రాయింగ్ పోటీలో ప్రధమ బహుమతి బూర్గంపాడు రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ఏ. రూపా దేవి, ద్వితీయ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గండుగులపల్లి కి చెందిన టి. శ్రావ్య, తృతీయ బహుమతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పాల్వంచకు చెందిన డి.జనని సాధించారు.
క్రాఫ్ట్ విభాగంలో ప్రథమ బహుమతి బూర్గంపాడు రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ఏ. సాయి మనస్వి, ద్వితీయ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొర్రాజులగుట్ట కి చెందిన కే. భవ్య శ్రీ, తృతీయ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుజాతనగర్ చెందిన వి. అక్షర సాధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కార్యదర్శి శ్రీ ఎస్. మాధవరావు, జిల్లా బాలిక విద్య కోఆర్డినేటర్ జే. అన్నామని, జిల్లా సైన్స్ అధికారీ బి. సంపత్ కుమార్, లక్ష్మీదేవి పల్లి మండలం ప్రశాంత్ నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి అజ్మీరా లైలా, వివిధ మండలాల మండల విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






