13 August, 2026 | 4:02 AM

ఇసుక లారీలతో దిగ్బంధనం!?

13-08-2026 01:32 AM

ప్రమాదాలకు నిలయంగా మణుగూరు - ఏటూరు నాగారం ప్రధాన రహదారి

వాహనదారుల ఇక్కట్లు 

ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించాలని వేడుకోలు

మణుగూరు టౌన్, ఆగస్టు 12 (విజయక్రాంతి): ఇసుక లారీల రవాణా వలన మణుగూరు, ఏటూరునాగారం మండల ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నారు. పినపాక మండలంలో ప్రధానంగా మూడు రహదారులు గుండా నిత్యం ప్రజలు ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం మూడు ప్రధాన రహదారులు ఇసుక లారీల ద్రగ్బంధనంలో కొనసాగుతున్నాయి.

పినపాక మండలం నుంచి ఖమ్మం ఇతర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు ఏడూళ్లబయ్యారం నుండి మణుగూరు వైపు ప్రయాణిస్తారు. ఈ రహదారిలో నిత్యం బి టి పి ఎస్ కు బొగ్గు రవాణా చేసే బొగ్గు లారీలతో రహదారి రద్దీగా ఉంటుంది దీనికి తోడు రామానుజారం,సాంబాయిగూడెంతో పాటు మణగూరు మండలాలోని ఇతర ఇసుక రాంపులకు వచ్చే ఇసుక లారీలు ఈ రహదారి గుండా ప్రయాణం చేయడంతో మరింత ప్రమాదకరంగా మారింది.

దీంతో మణుగూరు ఏడూళ్ల బయ్యారం రహదారిపై ప్రయాణించాలంటే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది. మరో వైపు ఏడూళ్ల బయ్యారం నుండి ఏటూరునాగారం, వరంగల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి ఇదే ఇసుక లారీలతో నిత్యం రద్దీగా మారుతుంది. ఈ రహదారి పై జానంపేట దుగినేపల్లి, చేగర్శల గ్రామాల వద్ద ప్రధాన రహదారిపై నిత్యం వందలాది ఇసుక లారీలు రహదారిని ఆక్రమించడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మూడవ రహదారి పినపాక, కరకగూడెం, తాడ్వాయి మండలాలను కలిపే ఏడూళ్ల బయ్యారం, తాడ్వాయి ప్రధాన రహదారి కూడా ఇప్పుడు ఇసుక లారీల రద్దీతో ప్రమాదకరంగా మారుతుంది. ఈ మూడు రహదారుల గుండా పినపాక మండలానికి రాకపోకలు సాగించే ప్రజలు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది. ఈ రహదారులపై ప్రయాణం చేయాలంటే ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ఇసుక లారీల రాకపోకలు ఆగకుండా కొనసాగుతున్నాయి. స్కూల్కి వెళ్లే పిల్లలు, పనులకు వెళ్లే కార్మికులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వాహనాలు కూడా ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నాయి. మణుగూరు ఏటూరునాగారం ప్రధాన రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతుండగా ఇప్పుడు ఏడూళ్ల బయ్యారం తాడ్వాయి ప్రధాన రహదారిగా ప్రమాదాలకు నిలయంగా మారే పరిస్థితి ఏర్పడుతున్నాయి.

ఈ రహదారిపై ఇసుక లారీలను నిలిపివేయాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గొడిశాల రామనాథం, ఉపసర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులు అచ్చా నవీన్ కూడా అధికారులకు విజ్ఞప్తులు చేశారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. ఈ సందర్భంగా ప్రజలు ఇసుక లారీల రాకపోకలకు నిర్దిష్ట సమయాలను నిర్ణయించాలని,గ్రామీణ రహదారులపై భారీ వాహనాల నియంత్రణ చేపట్టాలని, ఇసుక లారీల రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే, ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.