21 March, 2026 | 3:34 AM

3 ట్రిలియన్ ఎకానమీ దిశగా ప్రణాళికలు!

21-03-2026 01:44 AM
  1. జీఎస్‌డీపీ వృద్ధి 10.7%
  2. భారీగా పెరిగిన తలసరి ఆదాయం
  3. తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్
  4. రూ. 8 లక్షల కోట్లను దాటిన రాష్ట్ర అప్పులు
  5. సామాజిక ఆర్థిక నివేదిక

హైదరాబాద్, మార్చి ౨౦ (విజయక్రాంతి): క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ), ప్యూర్ (పెరీఅర్బన్ రీజియన్ ఎకానమీ), రేర్ (రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ) పేర్లలో రాష్ట్రాన్ని మూడు ఆర్థిక విభాగాలుగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ గా రూపొందించాలనే లక్ష్యంగా ప్రణాళికలు రచించి ముందుకు సాగుతుందని, అందుకు సానుకూల సంకేతాలుకూడా అందుతున్నాయిన పేర్కొంది.

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం (ప్రణాళిక శాఖ) తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్-2026 (తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదిక-2026)ను విడుదల చేసింది. ఇందులో ఇప్ప టి వరకు సాధించిన ప్రగతి, మూడు రీజియన్లలో ఉన్న ఆర్థిక పరిస్థితు లు, భవిష్యత్తులో సాధించాలనుకుంటున్న లక్ష్యాలను పొందుపర్చారు. ఈ సామాజిక ఆర్థిక నివేదిక-2026లోని ముఖ్యాంశాలు..

జీఎస్‌డీపీలో 10.7 వృద్ధిరేటు..

రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 10.7 శాతంతో వృద్ధి చెందడం శుభపరిణామమని అందులో తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 17,82,198 కోట్లుగా (ప్రస్తుత ధరల్లో) గణించారు. ఇది 2024-25లో రూ. 16,09,902 కోట్లు. అంటే 10.7 శాతం తో వృద్ధి  నమోదవుతోంది. ఇది జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వృద్ధిరేటు (8.0 శాతం) కంటే ఎక్కువగా ఉంది. స్థిరీకరించిన ధరల వద్ద చూసుకున్నా.. ఆల్ ఇండియా జీడీపీ 7.4 శాతంతో వృద్ధి చెందగా.. తెలంగాణ రాష్ట్ర జీఎస్‌డీపీ 8.5 శాతంతో వృద్ధి చెందుతున్నట్టుగా నివేదికలో పేర్కొన్నారు.

తలసరి ఆదాయం రూ.4,18,931

రాష్ట్రంలో తలసరి ఆదాయంలో భారీగా పెరుగుదల నమోదైనట్టు గా నివేదికలో తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,80,031 ఉండగా.. 2025-26 ఆర్థిక సంవత్సరంనాటికి 10.2 శాతంతో వృద్ధి సాధించి రూ. 4,18,931కి చేరుకుంది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ. 2,05,324 నుంచి రూ. 2,19,575 కు చేరుకుందని, ఇది 6.9 శాతం వృద్ధిని సాధించిందని అందులో తెలిపారు.

దూసుకుపోతున్న సేవల రంగం..

రాష్ట్రంలో సేవల రంగం ఆర్థికంగా ముందుకు సాగుతోంది. 2025 -26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పరిశీలిస్తే.. మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 68.6 శాతం సేవల రంగానిదే ఉన్నట్టు నివేదికలో తెలిపారు. ఇక ప్రాథమిక రంగమైన వ్యవసాయం నుంచి 15.1 శాతం, పారిశ్రామిక రంగం (ద్వితీయ రంగం) నుంచి 16.3 శాతం భాగస్వామ్యం ఉంది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో పరిశీలిస్తే.. సేవల రంగం 56.4 శాతం, వ్యవసాయం 18.4 శాతం, పారిశ్రామిక రంగం 25.2 శాతంగా ఉంది.

అంటే సేవల రంగంలో తెలంగాణ దూసుకుపోతుందని చెప్పవచ్చు. 2024-25లో వ్యవసాయ రంగం నుంచి ఉత్పత్తి అయిన సేవల విలువ రూ. 2,46,282 కోట్లు కాగా.. 2025-26లో ఇదికాస్తా రూ. 2,49,691 కోట్లకు చేరింది. అదే సమయంలో ద్వితీయ రంగం (పారిశ్రామిక రంగం) రూ. 2,68,325 కోట్లకు చేరుకుంది. ఇక సేవల రంగం (మూడోరంగం) 2025-26లో 13.5 శాతం వృద్ధితో రూ. 11,30,596 కోట్లకు చేరుకుంది.

రాష్ట్రంలో 17.22 లక్షల ఎంఎస్‌ఎంఈలు..

రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) మొత్తం 17,22,031 ఉద్యం పోర్టర్‌లో రిజిస్టర్ అయినట్టుగా నివేదిక తెలిపింది. ఇందులో 13,74,100 యూనిట్లు అంటే మొత్తం రిజిస్టర్ అయిన యూనిట్లలో 79.8 శాతం ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించినట్టు అందులో తెలిపారు. ఇందులోనూ హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 2,38,879 యూనిట్లు ఉండగా.. తరువాతి స్థానంలో రంగారెడ్డి జిలా 1,63,776 యూనిట్లతో ఉంది. చిట్ట చివరి స్థానంలో ములుగు జిల్లా 5,515 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉన్నట్టుగా తెలిపారు.

విద్యుత్తులో ముందుకు..

రాష్ట్రంలో మొత్తం విద్యుత్తు స్థాపిత సామర్థ్యం గణనీయంగా పెరుగుతూ ఉంది. 2023-24లో 20,191 మెగావాట్లుగా ఉన్న స్థాపిత సామర్థ్యం 2024-25 నాటికి 20,884 మెగావాట్లకు.. 2025-26 నాటికి (25.1.2026 వరకు) 23,187 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో తెలంగాణ జెన్‌కో విషయానికి వస్తే.. స్థాపిత సామర్థ్యం 6,485 మెగావాట్ల నుంచి 72,85 మెగావాట్లకు.. చేరుకోగా.. 2025-26 నాటికి 8823 మెగావాట్లుకు చేరుకుంది. తెలంగాణ ట్రాన్స్‌కోకు ఉన్న అప్పుల విషయంలో 1.12.2023 నాటికి రూ. 10,027 కోట్లు ఉండగా.. 30.11.2025 నాటికి ఈ అప్పులు 7,361 కోట్లకు తగ్గింది. 

ప్రైవేటుదే హవా..

ప్రాథమిక విద్య విషయంలో రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలదే హవా కొనసాగుతోంది. 2026 జనవరి చివరి నాటికి సేకరించిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 39,641 విద్యా సంస్థలు ఉండగా.. ఇందులో 62.36 లక్షల మంది చదువుకుంటున్నారు. ఇం దులో ప్రభుత్వ ఆధ్వర్యంలోని 24,214  పాఠశాలల్లో 16,61,520 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 35 తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ పాఠశాలలు ఉండగా.. ఇందులో 20,982 మంది చదువుతున్నారు.

ఇక ప్రైవేటు విద్యా సంస్థలు 11,689 ఉండగా.. ఇందులో 37,43,893 మంది విద్యార్థులు ఉన్నారు. 194 తెలంగాణ మోడల్ స్కూల్లలో 1.08 లక్షల మంది విద్యార్థులు, 495 కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో 1.31 లక్షల మంది, 235 సోషల్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో 1.30 లక్షల మంది విద్యార్థులు, 1679 ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లలో 89 వేల మంది, 294 మహాత్మా జ్యోతిభా ఫూలే స్కూల్లలో (బీసీ) 1.44 లక్షల మంది, 2025 మైనారిటీ రెసిరెన్సియల్ స్కూళ్లలో 74 వేల మంది చదువుతున్నారు.

రాష్ట్రంలో 1.81 కోట్ల వాహనాలు..

రాష్ట్రంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గత ఏడాదితో పోల్చితే 5.9 శాతం పెరుగుదల ఉందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం వాహనాలు 1,81,37,435 (డిసెంబర్ 2025 నాటికి) ఉండగా.. ఇం దులో 1,32,87,504 ద్విచక్ర వాహనాలే. కార్లు, జీపులు 24.66 లక్షలు ఉండగా.. ట్రాక్టర్లు 8.10 లక్షలు, గూడ్స్ క్యారేజె స్ 6.83 లక్షలు, ఆటో రిక్షాలు 5.53 లక్షలు, మోటార్ క్యాబ్స్ 1.55 లక్షలు, ఇతర వాహనాలు 98వేలు, విద్యాసంస్థల బస్సు లు 33 వేలు, మ్యాక్సీ క్యాబ్స్ 27 వేలు, కాంట్రాక్ట్ క్యారేజెస్ 9264, స్టేజ్ క్యారేజెస్ 9 వేలు, ప్రైవేటు సర్వీస్ వాహనాలు 3334, ఈరిక్షాలు 407 ఉన్నట్టుగా నివేదికలో తెలిపారు. 

రూ. 8 లక్షల కోట్లను దాటిన అప్పులు..

రాష్ట్ర ప్రభుత్వం అప్పుల జాబితానుకూడా ఈ సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్-2026లో స్పష్టంగా తెలిపారు. 2025 డిసెంబరు నాటికి మొత్తం అప్పులు రూ. 8,00,805 కోట్లుగా తేల్చారు. ఇందులో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోని రుణాలు రూ. 4,95,374 కాగా.. ప్రభుత్వం గ్యారంటీతో ప్రత్యేక సంస్థలు (ఎస్‌పీవీలు) తెచ్చుకున్న అప్పులు రూ. 86,327 కోట్లు ఉండగా.. ప్రభుత్వ గ్యారంటీతో అప్పులు తెచ్చుకుని సొంతగా కట్టుకునే సంస్థలు తీసుకున్న రుణాలు రూ. 1,59,253 కోట్లు ఉండగా.. వివిధ కార్పొరేషన్లు తెచ్చుకున్న రుణాలు రూ. 59,851 కోట్లు ఉన్నట్టుగా తేల్చారు.

దీనితో 2025 డిసెంబరు చివరి నాటికి మొత్తం అప్పులు రూ. 8.08 లక్షల కోట్లుగా స్పష్టంగా పేర్కొన్నారు. గడిచిన 25 నెలల్లో.. అంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయం నుంచి (1.12.2023 నుంచి 31.12.2025 నాటికి) గడిచిన 25 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మొత్తం అప్పులు రూ. 3,19,179 కోట్లుగా నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో అంటే గడిచిన 25 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిన అప్పులు, వడ్డీ మొత్తం రూ. 3,04,202 కోట్లు కావడం గమనార్హం.

2023 డిసెంబరు 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు కాగా..2025 డిసెంబరు చివరి నాటికి మిగిలి ఉన్న మొత్తం అప్పులు రూ. 8,00,805 కోట్లు. అంటే గడిచిన 25 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పుల భారం రూ. 1,29,048 కోట్లు కావడం ఇక్కడ గమనార్హం. 

సన్నకారు రైతులే ఎక్కువ..

రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో సాగుకు ఉపయోగిస్తున్న మొత్తం భూమి 50.13 శాతం ఉంది. 24.69 శాతం అడవులు ఉన్నట్టుగా నివేదికలో (2021-22 సర్వే ప్రకారం) పేర్కొన్నారు. ఇక సాగుకు సంబంధించి చూస్తే.. సన్నకారు, చిన్న రైతులే ఎక్కువగా ఉన్నట్టుగా నివేదికలో తెలిపారు. రాష్ట్రంలో మొత్తం సన్నకారు రైతులు (2.47 ఎకరాల లోపు) 48.47 లక్షల మంది ఉండగా.. వారు సాగుచేస్తున్న వ్యవసాయ భూమి 51.08 లక్షల ఎకరాలుగా నివేదిక తేల్చి చెప్పింది.

అలాగే చిన్నకారు రైతులు (2.48 ఎకరాల నుంచి 4.94 ఎకరాల వరకు) 16.0 లక్షల మం ది ఉండగా.. వారు 55.28 లక్షల ఎకరాలను సాగుచేస్తున్నారు. దిగువ మధ్యస్థాయి రైతులు (4.95 ఎకరాల నుంచి 9.88 ఎకరాల వరకు) రాష్ట్రం లో 5.04 లక్షల మంది ఉండగా.. వారు 32. 05 లక్షల ఎకరాలను సాగుచేస్తున్నారు.

మధ్యస్థాయి (9.89 ఎకరాల నుంచి 24.77 ఎకరాల వరకు) సాగుచేస్తున్న రైతులు 99 వేల మంది ఉండగా.. వీరు 13.52 లక్షల ఎకరాలను సాగుచేస్తున్నారు. ఇక పెద్ద రైతులు (24.78 ఎకరాలకు పైగా) రాష్ట్రంలో మొత్తం 9000 మంది ఉండగా.. వీరు 4.05 లక్షల ఎకరాలను సాగుచేస్తున్నారు. మొత్తం ఒక కోటి 55 లక్షల 97 వేల ఎకరాల్లో వ్యవసాయం జరుగుతున్నట్టు నివేదికలో పేర్కొన్నారు.

రంగారెడ్డి టాప్..

జిల్లా స్తూల దేశీయ ఉత్పత్తి విషయంలో రంగారెడ్డి జిల్లా టాప్‌లో నిలిచింది. 2024-25లో  రంగారెడ్డి జిల్లా రూ. 3,41,080 కోట్ల విలువైన ఉత్పత్తిని చేయగలిగింది. అటు తరువాత హైదరాబాద్ జిల్లా రూ. 2,25,860 కోట్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రూ. 1,16,133 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక చిట్టచివరన (33వ స్థానం) ములుగు జిల్లా నిలిచింది. ములుగు జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తి విలువ రూ. 11,943 కోట్లు మాత్రమే.

జిల్లాల వారీగా తలసరి ఆదాయం చూసుకుంటే.. రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం  (2022 రూ. 11,29,735 గా నివేదికలో తేల్చారు. అటు తరువాత హైదరాబాద్ జిల్లాలో తలసరి ఆదాయం రూ. 4,76,679 కాగా.. అతి తక్కువగా హన్మకొండ జిల్లాలో రూ. 2,37,809 గా నివేదిక తేల్చి చెప్పింది. ఆశ్చర్యకరంగా జిల్లా స్థూల ఉత్పత్తిలో చిట్టచివరన ఉన్న ములుగు జిల్లా.. తలసరి ఆదాయంలో మాత్రం ఏడో స్థానంలో (రూ. 3,35,509) నిలవడం గమనార్హం.