కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ఈ నెల 18న చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి
బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సత్యమూర్తి
హనుమకొండ, జూన్ 6 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 18న చలో హైదరాబాద్ మహాసభను విజయవంతం చేయాలని బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వేముల సత్యమూర్తి పిలుపునిచ్చారు.
తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమార్లు వినతి పత్రాలు సమర్పించిన నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను వెంటనే చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఎటువంటి ప్రభావాలు, సిఫారసులు లేకుండా, వివక్ష లేకుండా క్రమసంఖ్య ఆధారంగా చెల్లించాలని, ముందుగా పనులు చేసి, సంవత్సరాలుగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించామన్నారు.
ఆర్థిక ఇబ్బందులవల్ల, బిల్లుల చెల్లింపులు ఆలస్యం కారణంగా అనేకమంది కాంట్రాక్టర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు గుండెపోటులకు గురవుతున్నారన్నారు. ఈ పరిస్థితి నిర్మాణరంగం భవిష్యత్తుకు తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
ఇది కేవలం కాంట్రాక్టర్ల సమస్య మాత్రమే కాదు, నిర్మాణరంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షల మంది కుటుంబాలకు సంబంధించిన అత్యంత కీలకమైన సమస్యని అని,దీనిని వెంటనే పరిష్కరించాలనిడిమాండ్ చేస్తూ జూన్ 18న హైదరాబాద్ లో నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంట్రాక్టర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ స్టేట్ చైర్మన్ బి. సుగుణాకర్ రావు , మాజీ స్టేట్ చైర్మన్ కటుకూరి దేవేందర్ రెడ్డి , మాజీ స్టేట్ చైర్మన్ యూ. సురేందర్ , స్టేట్ అడ్వైసర్ కె. ప్రభాకర్ రెడ్డి, జనగాం సెంటర్ పాస్ట్ చైర్మెన్ ఇమ్మడి దేవేందర్ రెడ్డి, వరంగల్ సెంటర్ చైర్మెన్ ఈ. మనోజ్ , జిల్లా నాయకులు,వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ గౌడ్, ఆదిల్,యాదవరెడ్డి, సతీష్, తోట రాజేష్,తదితరులు పాల్గొన్నారు.






