7 June, 2026 | 2:35 AM

మహిళా సంఘాలకు కొత్తగా 554 బస్సులు

07-06-2026 01:03 AM

మహిళా ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యం

స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి  

మహబూబాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మహిళా సంఘాలకు మరో 554 బస్సులను అందజేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు.

శనివారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని అనంతరం మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత రెండేళ్లలో మహిళా సంఘాలకు 61 వేల కోట్ల రూపాయలను రుణాలుగా అందించామని, ప్రస్తుతం వడ్డీ లేని రుణాలను 10 లక్షల వరకు పెంచామని తెలిపారు.కొత్తగా మహిళా సంఘాలకు 600 కోట్ల వడ్డీ బకాయిలను కూడా విడుదల చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉండి మరణించిన మహిళల కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా, రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఆసరాగా 5 లక్షల బీమా పథకాన్ని సీఎం ప్రారంభించినట్లు చెప్పారు.గిరిజన ప్రాంతాల్లో మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అటవీ ఉత్పత్తుల ద్వారా వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అలాగే ములుగు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో తదితరులు పాల్గొన్నారు.