ఊరికి టికెట్ కొడతారు.. ఊరు బయట దింపేస్తారు!
‘అడ్డాకల్ ఊర్లోకి మేము రాము‘ కండక్టర్ వ్యాఖ్యపై ప్రయాణికుల ఆగ్రహం
అడ్డాకుల జూన్ 18: మహిళలకు సముచిత స్థానం కల్పించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. కాగా కొందరి ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్య కారణంగా ఉచిత ప్రయాణానికి తూట్లు పొడుస్తున్నారు. ఏమైనా డబ్బులు ఇచ్చి బస్సు ఎక్కుతున్నారా? ఎక్కడైనా దిగి కొంత దూరం నడుస్తూ తప్పేముంది అనేలా వ్యవహరిస్తూ వారి విధి నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ నుంచి అడ్డాకల్ గ్రామానికి వస్తున్నా సమయం లో టికెట్లు జారీ చేసి గ్రామంలోకి వెళ్లకుండా ఊరు బయటే ప్రయాణికులను దింపేసిన ఆర్టీసీ బస్సు ఘటనపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండే ఎండలో చంటి పాపతో సహా మహిళలు, వృద్ధులు, చిన్నారులు సుమారు కిలోమీటర్ మేర నడుచుకుంటూ గ్రామానికి చేరుకోవాల్సి వస్తుందని వాపోయారు.
పల్లెవెలుగు బస్సు.. పైనే వెళుతుందంట
ఆ బస్సుల పేర్లే పల్లె వెలుగు ప్రతి పల్లెలో ఆపాలనదే ఆ బస్సుల విధానం. కాగా ప్రమాదాలు జరగకుండా ప్రధాన గ్రామాలలో హైవేపై బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా బ్రిడ్జి కిందికి వెళ్లినందుకు పల్లె వెలుగు బస్సులు సైతం బ్రిడ్జి పైనే వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కొత్తకోటకు వెళ్తున్న TG07 Z 0041 నంబర్ గల పల్లెవెలుగు బస్సులో ప్రయాణిస్తున్న వారు అడ్డాకల్కు టికెట్లు తీసుకున్నారు. అయితే బస్సు గ్రామంలోకి వెళ్లకుండా అడ్డాకల్కు బయటే వారిని దింపి వెళ్లిపోయిందని ఆరోపించారు.
ఈ సందర్భంగా షాద్నగర్ డిపోకు చెందిన బస్సు కండక్టర్ ‘అడ్డాకల్ ఊర్లోకి మేము రాము‘ అంటూ సమాధానం చెప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంత ప్రయాణికుల సమస్యలు కొనసాగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అడ్డాకల్ మండల కేంద్రంలోకి రావాల్సిన కొన్ని బస్సులు ఫ్లైఓవ్పనుంచే వెళ్లిపోతుండటంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. టికెట్లో గమ్యస్థానంగా అడ్డాకల్ అని పేర్కొని, గ్రామంలోకి రాకుండా బయటే దింపడం ప్రయాణికుల హక్కులను కాలరాయడమేనని స్థానికులు విమర్శించారు. సంబంధిత ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి అడ్డాకల్ మండల కేంద్రంలో అన్ని బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






