పార్కింగ్ లేక పరేషాన్
రోడ్లపైనే వాహనాలు..
జాతీయ, అంతర్గత రోడ్లు నిండిపోతున్నాయి
ఇబ్బంది పడుతున్న వాహన చోదకులు
అనుమతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
అడ్రస్ లేని ట్రాఫిక్ పోలీసులు..
భద్రాద్రి కొత్తగూడెం, మే 12, (విజయక్రాంతి): ఇక్కడ ఎవరి ఇష్టం వారిదే... కాసుల పడేస్తే అనుమతులతో పని లేదు. నిబంధనలను తుంగలో తొక్కి సెట్ బ్యాక్ లేకుండానే వ్యాపార సముదాయాలు నిర్మించి దర్జాగా వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. కళ్ళ ముందే నిబంధనలు పాతర వేస్తున్న పట్టించుకునే నాధుడే ఉండడు. ఎందుకంటే అందరూ ఒక్క తాను బట్టలే కాబట్టి అవినీతి అక్రమాలు వారికి వెన్నతో పెట్టిన విద్య.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ డివిజన్ పరిధిలో పార్కింగ్ స్థలాలు లేక ప్రజలు పరేషాన్ అవుతున్నారు. జాతీయ, అంతర్గత రోడ్లు యావత్తు ఆక్రమాలతో నిండిపోతున్నాయి. ఫలితంగా వాహనాలన్నీ రోడ్డు పైనే నిలపడంతో వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భవనాలకు అనుమతులు ఇవ్వాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అందిన కాడికి పుచ్చుకొని అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పాల్వంచ డివిజన్ పరిధిలోని శాస్త్రి రోడ్డు, భద్రాచలం రోడ్ లోని అంబేద్కర్ సెంటర్, దమ్మపేట సెంటర్, కిన్నెరసాని రోడ్డు, కొత్తగూడెం లోని చిన్న మార్కెట్ ,రైల్వే స్టేషన్ రోడ్, ఎంజీ రోడ్డు యావత్తు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. వ్యాపారస్తులు డ్రైనేజీలను ఆక్రమించి వ్యాపారాలు చేయడం, చిరు వ్యాపారాలు దుకాణాల ఎదురుగా రోడ్ల పైన బయట ఎంచటం తో వాహనాలన్నీ రోడ్లపైనే నిలపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
వ్యాపార సముదాయాలకు సెట్ బ్యాక్ తప్పనిసరి
పట్టణ ప్రాంతంలో వ్యాపార సముదాయాలు నిర్మించాలంటే తప్పనిసరిగా మూడు అడుగుల సెట్ బ్యాక్ తీసుకొని భవన నిర్మాణం చేయాల్సి ఉందనే నిబంధన ఉంది. అనుమతులు ఇచ్చే సమయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నిర్మాణం పనులను తనిఖీలు చేయాల్సి ఉంది.
వ్యాపారస్తులు ఇచ్చే ముడుపులకు తలవకి ఏసీ గదిలో నుంచి బయటకు రాకుండా అనుమతుల పత్రాలను జారీ చేయడం గమనార్హం. ఫలితంగా స్థల యజమాని సెట్ బ్యాక్ లేకుండానే భవనాలు నిర్మించి వ్యాపారాలు చేపట్టారు. దీనికి తోడు ఫుట్పాతులను ఆక్రమించి వస్తువులను ఏర్పాటు చేయడంతో వినియోగదారులు తమ వాహనాలను రోడ్లపైనే నెలపాల్సిన పరిస్థితి నెలకొంది.
పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు
ట్రాఫిక్ నియంత్రణ అమలు చేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం రోడ్ల పైన ఉన్న వాహనాలపై సెల్ఫోన్లతో ఫోటోలు తీసీ జరిమానాలు వేస్తున్నారు తప్ప, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జాడే ఉండదు
పన్నుల వసూళ్ల పై ఉన్న దృష్టి,వ్యాపారస్తుల అక్రమ నిర్మాణాల అరికట్టడంలో విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం పార్కింగ్ స్థలాలను సైతం గుర్తించకపోవడం శోచనీయం. ఉదయం ,సాయంత్రం వేళల్లో రోడ్ల పైన ప్రయాణం ప్రాణాలతో చెలగాటం ఉన్నట్లుగా ఉందని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






