డ్రగ్స్ టెస్టులో పట్టుబడ్డ పాక్ క్రికెటర్
మహ్మద్ నవాజ్‌పై పీసీబీ విచారణ
లాహోర్, ఏప్రిల్ 22: పాకిస్తాన్ క్రికెట్‌లో మరో వివాదం చెలరేగింది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పాక్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ పట్టుబడ్డాడు. అతడు వినోదం కోసం వాడే మాదకద్రవ్యాలను వాడినట్లు తేలింది. ఈ విషయాన్ని ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. దీంతో అతడిపై పీసీబీ విచారణ మొదలు పెట్టింది. నవాజ్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సులాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది పీఎస్‌ఎల్ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు నవాజ్ దూరం కానున్నాడు.
అలాగే నవాజ్‌కు పాక్ క్రికెట్ బోర్డు మరో షాకిచ్చింది. వచ్చే నెలలో ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో అతడు సర్రే క్లబ్‌కు ఆడాల్సి ఉంది. ఇప్పటికే పీసీబీ అతడికి ఎన్‌వోసీ కూడా మంజారు చేసింది. అయితే తాజా వివాదం కారణంగా పీసీబీ ఈ ఎన్‌వోసీని నిలిపివేసినట్లు తెలుస్తోంది. నవాజ్ పాక్ జట్టులో ప్రస్తుతం కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచక ప్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో పాకిస్తాన్ తరపున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నవాజ్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. టీ20ల్లో రెండుసార్లు 5 వికెట్ల ఘనత సాధించిన ఏకైక పాక్ బౌలర్‌గానూ ఘనత సాధించాడు. తాజా వివాదంలో నవాజ్ దోషిగా తేలితే పీసీబీ కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.






