31 May, 2026 | 2:47 AM

దేవిశ్రీకి జోడీగా..?

31-05-2026 01:45 AM

‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారి ఒక్కసారిగా ప్రేక్షకుల మనసులు దోచేశాడు కమెడియన్ వేణు యెల్దండి. ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమా చేసిన తర్వాత వేణు.. ఇప్పుడు ‘ఎల్లమ్మ’ సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్.  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయం చాలా రోజులుగా చర్చ జరుగుతోంది.

ఇప్పటికే సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందని టాక్ వచ్చింది. ఆ తర్వాత కీర్తి సురేశ్ పేరూ వినిపించింది. ఆమె కాదు.. మృణాల్ ఠాకూర్ అన్నారు. తాజాగా ఓ యంగ్ బ్యూటీ తెరపైకి వచ్చింది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. ‘ప్రేమలు’, ‘డ్యూడ్’ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న మమిత బైజు! ఈ అమ్మడికి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఇటీవలే ధనుష్ ‘కర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మమిత.. తమిళనాడు సీఎం దళపతి విజయ్ ‘జన నాయగన్’లోనూ కనిపించనుంది.

ఇక ఇప్పుడు ఈ చిన్నది నేరుగా తెలుగులోకి అడుగు పెట్టనుందని తెలుస్తోంది. ‘ఎల్లమ్మ’ సినిమాలో మమిత హీరోయిన్‌గా నటిస్తోందని టాక్ వినిపిస్తుంది. ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మమిత కథానాయికగా నటిస్తుందా? లేక.. టైటిల్ రోల్ (ఎల్లమ్మ దేవత)లో మెరుస్తుందా అనేది తెలియాలంటే అధికారిక ప్రక టన వచ్చేదాకా ఆగాల్సిందే.