8 August, 2026 | 2:44 AM

‘పాలేరు’లో ముమ్మరంగా వరినాట్లు

08-08-2026 01:23 AM
  1. ఆలస్యమైనా.. అతి వేగంగా నాట్లు
  2. బిజీబిజీగా మారిన కూలీలు, రైతులు
  3. జోరు వర్షాలతో ముమ్మరంగా వ్యవసాయ పనులు

కూసుమంచి, ఆగస్టు 7(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి.   నియోజకవర్గ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైయ్యారు. నియోజకవర్గంలోని కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాల్లో ఆగస్టు నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. గత నాలుగు రోజుల నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో చెరువులు, కుంటలకు మోస్తారుగా వర్షపు నీరు వచ్చి చేరాయి. అలాగే పంటచేల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో  రైతులు పంటల సాగుపై దృష్టి పెట్టారు. పత్తి, మిర్చి పంటల సాగు పై రైతులు ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పత్తి పంట ప్రాణం పోసూకుంది. దీంతో రైతులు ఎరువులు వేసుకోవడం, గడ్డి, చెత్త తొలిగించడం, అరకలతో దున్నడం లాంటి పనులు చేస్తున్నారు.

ముమ్మరంగా వరినాట్లు..

పాలేరు నియోజకవర్గంలో గత నాలుగు రోజులుగా వర్షాలు పడుతుండటంతో రైతులు ముమ్మరంగా వరినాట్లు వేస్తున్నారు. బోర్ల కిందా, కాలువల కిందా, ముఖ్యంగా పాలేరు జలాశయం చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు వరి నాట్లు సాగు చేస్తున్నారు.

చెరువులు, కుంటల ఆయకట్టు కిందా బోర్లు ఉన్న రైతులు వరి పంటలను సాగు చేసే పనిలో నిమగ్నమైయ్యారు. సుమారు 30శాతం పంటపోలాల్లో రైతులు వరి పంటలను సాగు చేస్తున్నారు.  ఒక వైపు ప్రభుత్వం వారి పంటలను సాగు చేయోద్దు, ఎలినోనా ప్రభావం తో వర్షాలు అతి తక్కువ కురిసే అవకాశం ఉందాని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులు ముమ్మరంగా వరి నాట్లు సాగు చేస్తున్నారు. ఇక మరో వైపు వ్యవసాయ కూలీలు కూడా బిజిబిజీగా మారిపోయారు. తెల్లవారితే చాలు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు.

ప్రత్యామ్నాయ పంటల జాడేది..

రాష్ట్రంలో ఎలినోనా ప్రభావం ఉంది. వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేదు. కావునా రైతులు వరి, పత్తి, మిర్చి పంటలను ఆపేసి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం, మరో వైపు అధికారులు రైతులకు సూచన చేశారు. వ్యవసాయం శాఖ, అన్ని శాఖల అధికారులు ఊరూరా రైతులకు అవగాహన కల్పించారు. వరి, పత్తి, మిర్చి పంటలను సాగు చేయోద్దని, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు ఊరూరా అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు. కానీ రైతులు ప్రభుత్వం మాటను పెడచేవిన పెట్టి వరి, మిర్చి, పత్తి పంటలను సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల జోలికి పోకపోవడం గమనార్హం.