వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి
- బిజెపి మండల అధ్యక్షులు మిరియాల్కర్ బాలాజీ
కోనరావుపేట,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న వడ్ల కొనుగోలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోనరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ కోనరావుపేట మండల అధ్యక్షుడు మిర్యాల్ కార్ బాలాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఇప్పటికే నిల్వ ఉన్న ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. లేదంటే భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా నిలిచి ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు.






