ఎన్యూమరేషన్ పత్రాలు పూరించి ఇవ్వకపోతే ఓటరు జాబితాలో పేర్లు ఉండవు
కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక
నారాయణపేట, జూన్ 29 (విజయక్రాంతి): ఓటరు జాబితాల కచ్చితత్వం కోసం చేపట్టనున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి రాజకీయపార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక కోరారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో ఎస్. ఐ.ఆర్ ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి జులై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను ధృవీకరించనున్నట్లు ఆమె తెలిపారు.
జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని, ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరిస్తారని, ఆ తర్వాత సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ నెల 25 నుంచి బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేస్తున్నారని, కొత్త ఓటర్ల నమోదు కోసం ఫామ్ -6 అందజేస్తున్నారని, ఆయా పత్రాలను ఓటర్లు పూరించి మళ్ళీ బీఎల్‌వోలకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్‌వో లకు ఇస్తేనే ఓటరు జాబితాలో ఉంటారని, ఇవ్వకపోతే ఓటరు జాబితాలో ఉండరని ఆమె స్పష్టం చేశారు, ఇక నుంచి ప్రతీ మంగళవారం మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఉంటుందని, తర్వాత ఏ ఈ ఆర్ వో స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ తమ బూత్ స్థాయి ఏజెంట్లు బి ఎల్ వో లకు సహకరించే విధంగా చూడాలని ఆమె సూచించారు. వారానికి ఒకసారి నిర్వహించే సమావేశానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పక హాజరు కావాలని ఆమె కోరారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియకు సంబంధించి అనుమానాలను నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేస్తామన్నారు.
ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయ్యాక అన్ మ్యాపింగ్ కేసుల విచారణ జరుగుతుందన్నారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించబడదని కంగారు పడాల్సిన అవసరం లేదని, తీసుకున్న ఎన్యూమరేషన్ పత్రాలను కచ్చితంగా పూరించి ఇవ్వాలన్నారు. ఇవ్వకపోతే మాత్రం ఓటరు జాబితాలో వాళ్ళ పేర్లు ఉండవు అని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్‌వో రాజ్యలక్ష్మీ, సీ సెక్షన్ అధికారిని జయసుధ , వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.






