calender_icon.png 11 February, 2026 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధానిపై దాడికి విపక్షాల కుట్ర

11-02-2026 01:20:11 AM

  1.   4న కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధాని సీటును చుట్టుముట్టారు
  2. ముందస్తు ప్రణాళికతోనే వారు ఆ పనిచేశారు..
  3. స్పీకర్ సమాచారం మేరకే ప్రధాని గైర్హాజరు
  4. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు
  5. కాంగ్రెస్ మహిళా ఎంపీలకు సంబంధించిన వీడియో విడుదల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: లోక్‌సభలో ప్రధాని మోదీపై దాడికి విపక్షాలు కుట్ర పన్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంచలన ఆరోపణలు చేశారు. 4న ప్రధాని నరేంద్ర మోదీ సభకు ఎందుకు రాలేదనే విషయంపై వివరణ ఇస్తూ.. మంగళవారం సోషల్‌మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. వీడియో కిం ద.. ‘ఆ రోజు మహిళా ప్రతిపక్ష ఎంపీలందరూ ప్రధాని సీటును ఎలా చుట్టుముట్టారో.. ఎంత టి గందరగోళం సృష్టించారనేది’ ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు.

ప్రధానిపై దాడికి విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయని స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన సమాచారం నిజమేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ గౌరవానికి విరుద్ధంగా ప్రవర్తించారని విమర్శించారు. ఒకవేళ తాము బీజేపీ ఎంపీలను ఆపకుండా ఉండి ఉంటే సభలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవని తెలిపారు. మహిళా ఎంపీలు ప్రధాని కూర్చునే వరుసలోకి వచ్చి బ్యానర్లతో నిరసన తెలపడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

సభా మర్యాదలను కాపాడటం కోసమే తాము సంయ మనం పాటించామని వెల్లడించారు. ఆ రోజు మహిళా ఎంపీలు ‘నీకు ఏది సరైనది.. అనిపిస్తే అదే చేయి’ అనే బ్యానర్‌ను ప్రదర్శించారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన పుస్తకంపై జరిగిన చర్చ నేపథ్యంలో ఆ నినాదం చర్చనీయాంశమైందన్నారు. తనతోపాటు గిరిరాజ్ సింగ్ చేతులు జోడించి అభ్యర్థించినా ప్రతిపక్ష సభ్యులు అక్కడి నుంచి కదలకుండా ఎలా ఉన్నారో వీడియో చూస్తే అర్థమవుతుందని దుయ్యబట్టారు.