నారపల్లి భూ బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
ఘట్ కేసర్ , జూన్ 26 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని నారపల్లి వరంగల్ హైవేపై దశాబ్దాలుగా జీవనోపాధి పొందుతున్న బాధితుల స్థలాన్ని నకిలీ పత్రాలతో కాజేయాలని చూస్తున్న లాయర్ మల్లుల అభిషేక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఘట్ కేసర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కర్రె రాజేష్ డిమాండ్ చేశారు. నారపల్లిలో బాధితులతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు.
నారపల్లి మెయిన్ రోడ్డుపై సర్వే నెంబర్ 11, 14, 16 నుండి 20 లోని ప్లాట్లలో ఒకే కుటుంబానికి చెందిన ఎన్. విజయ, ఎన్. వరలక్ష్మి, ఎన్. సుందరాచారి పరస్పర అంగీకారంతో 2001 సంవత్సరంలో నాలుగు షట్టర్లు (దుకాణాలు) నిర్మించుకున్నారు. గత 25 ఏళ్లుగా వీటిని అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. వీటికి సంబంధించిన ఆస్తి పన్ను, కరెంటు బిల్లులను పోచారం మున్సిపాలిటీలో క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు.
అయితే సదరు స్థలంలో కిరాయికి ఉంటానని చెప్పి యజమానులతో అగ్రిమెంట్ చేయించుకున్న మల్లుల అభిషేక్ అనే లాయర్ ఆతర్వాత మోసపూరిత బుద్ధితో వ్యవహరించినట్లు తెలిపారు. గత స్థల యజమాని (విక్రయించిన) అప్పయ్య అనే వ్యక్తి మరణించిన అనంతరం అతని రెండవ కుమారుడు గాంధీబాబు నుండి వీలునామాను ఉపయోగించి ప్రస్తుతం అక్కడ ఉన్న నాలుగు షట్టర్లను ఖాళీ భూమిగా చూపిస్తూ నకిలీ ఫోటోలతో రెవెన్యూ అధికారులను మోసగించడం జరిగిందన్నారు.
విచారణలో అక్కడ అసలు యజమానులు క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నారని తేలింది. సదరు ప్లాట్‌కు ఇప్పటికే బాధితుల పేరిట విద్యుత్ కనెక్షన్ ఉందని, బిల్లులు చెల్లించబడుతున్నాయని అధికారులు ధ్రువీకరించినట్లు తెలిపారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఈ సమావేశంలో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, నారపల్లి మాజీ సర్పంచ్ రాజేష్, ముఖ్య నాయకులు పల్లె బాబురావు, మెట్టు గణేష్, కీసరగుట్ట దేవస్థానం డైరెక్టర్ సామల అమర్, పాల్గొన్నారు.






