13 March, 2026 | 5:37 AM

జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

13-03-2026 12:00 AM

ప్రజాప్రతినిధులకు కలెక్టర్ కె. హరిత పిలుపు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కె. హరిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఉమ్మడి జిల్లా శాసనమండలి సభ్యులు దండే విఠల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీఓ లోకేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, కాగజ్నగర్ , ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్పర్సన్లు షాహిన్ సుల్తానా, మెంగ్రే ఆకాష్ తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు తమ పరిధిలోని సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 2న ప్రతి గ్రామపంచాయతీ, వార్డులో గ్రామసభలు నిర్వహించి జూన్ 12 వరకు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. 

శాసనమండలి సభ్యులు దండే విఠల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మీనారాయణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తరావు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు ఎం.డి. అహ్మద్, కొత్తపల్లి అనిత,అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.