8 May, 2026 | 1:05 AM

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

08-05-2026 12:00 AM

మందమర్రి సీఐ పర్స రమేష్

మందమర్రి, మే 7: సైబర్ మోసాలపై, సోషల్ మీడియా విషయంలో అప్రమత్తంగా ఉండాలని మందమర్రి సీ ఐ పర్స రమేష్ అన్నారు. గురు వారం ఉదయం కాసిపేట ఎస్‌ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తవారిపేట గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా సిఐ మాట్లాడుతూ సైబర్ మోసాలు, ట్రాఫిక్ భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. తెలియని లింకులను ఓపెన్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని తెలిపారు.

ఫేక్ కాల్స్, ఫిషింగ్ సందేశాలు, సోషల్ మీడియా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 సేవలను వినియోగించాలని కోరారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.

స్వీయరక్షణ, నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. గ్రామాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో అలాగే ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను తగ్గించడంతో పాటు భద్రతను పెంచవచ్చని వివరించారు. కార్డన్ సెర్చ్ లో 38 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించారు.